AP In Deep Financial Crisis :
ap cm jaganఏపీ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా చెల్లించాల్సిన వేతనాల కోసం కూడా అప్పుల బాట పట్టాల్సి వస్తున్న తీరే ఇందుకు ప్రబల నిదర్శనంగా చెప్పుకోవాలి. మొన్నటికి మొన్న అప్పు రూపేణా తెచ్చుకున్న రూ.2 వేల కోట్లు కూడా ఓడి కింద జమ అయిపోయిన వైనం కూడా ఏపీ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే.. పాలనలో అపార అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు లాంటి నేత అయినా ఉండాలి. లేదంటే.. నాకు చేత కాదు మహాప్రభో అంటూ చేతులు ముడుచుకుని కూర్చుండిపోయిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలా అయినా వ్యవహరించాలి. కాదూ, కూడదూ.. ఈ రెంటిలో దేనికీ నేను సమ్మతం కాను అంటే.. సీఎం పదవికి రాజీనామా అయినా చేయాలి. లేదంటే ప్రజల్లో గొప్పగా చెప్పుకున్న నవరత్నాల్లోని సంక్షేమ పథకాలనైనా రద్దు చేయాలి. ఇవే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ముందు ఉన్న రెండంటే రెండు దారులు. చంద్రబాబు మాదిరిగా అనుభవం లేదు. కిరణ్ మాదిరి చేతులు ముడుచుకుని కూర్చోనూ లేరు. మరి పైన చెప్పిన రెండు మార్గాలే జగన్ దిక్కు అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
ఆర్థిక నిర్వహణపై అదుపు ఏదీ?
తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యాన్ని అందిస్తానని, నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను ప్రారంభిస్తానని చెప్పుకున్న జగన్.. జనాలను అయితే బుట్టలో వేసుకోగలిగారు. అయితే జనాలను బుట్టలో వేసుకున్నంత తేలిక కాదుగా సంక్షేమ పథకాల అమలు. అసలే రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ లో నవ్యాంధ్ర ప్రస్థానం ప్రారంభించినదాయే. మరి అలాంటప్పుడు ఖర్చులు తగ్గించుకుని, ఆర్థిక నిర్వహణలో పొదుపు పాటించుకుంటూ సాగితే తప్పించి నెగ్గుకు రాలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించేసిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎంత పొదుపు పాటించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే జగన్ ఎప్పుడైతే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో.. ఆర్థిక నిర్వహణపై ప్రభుత్వ యంత్రాంగానికి అదుపు లేకుండా పోయింది. అసలు పద్దులు రాయకుండా ఖర్చులు పెట్టేస్తున్న వైనాన్ని మొన్నామధ్య పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టిన తీరు చూస్తుంటే.. నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన కలగక మానదు. ఇంటి ఖర్చులను కూడా లెక్కలు రాసి పెట్టుకుంటున్న కాలంలో వందలు, వేల కోట్ల ప్రజా ధనాన్ని లెక్కాపత్రం లేకుండా ఎలా ఖర్చు పెడతారన్న ఆందోళణ సర్వత్రా వినిపిస్తోంది.
AP In Deep Financial Crisis
ఆంక్షల సడలింపునకు కేంద్రం నో
అధ్వాన్నంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇకపై తమకు చెప్పకుండా అప్పులు తీసుకోవడం కుదరదని కూడా షరతు పెట్టింది. అంతేకాకుండా వివిధ పథకాల కోసం తాము విడుదల చేసే నిధులను ఎందుకు విడుదల చేశామో, అందుకే వాడాలేని.. ఆ నిధులను ఇతరత్రా పథకాల కోసం మళ్లించరాదని కూడా ఆంక్షలు విధించింది. దీంతో జగన్ సర్కారులో వణుకు మొదలైందనే చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి కాస్తంత ఉపశమనం పొందేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అడ్వొకేట్ జనరల్, ఆర్థిక శాఖ కార్యదర్శిలను జగన్ ఢిల్లీ పంపారు. ఆ బృందం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడం, ఫలితంగా అప్పులు చేయక తప్పడం లేదన్న వాదనను వినిపించింది. అయితే ఈ వాదనలతో నిర్మలమ్మ శాంతించలేదంట. రాష్ట్రంపై విధించిన ఆంక్షలను సడలించేందుకు ససేమిరా అన్నారట. మరి ఈ ఆంక్షల నడుమ ఏపీకి అప్పులు దొరకడం కష్టమే. అప్పులు దొరక్కపోతే.. సంక్షేమ పథకాలు కాదు కదా.. జీతాలే చెల్లించలేని పరిస్థితి. ఇప్పటికే ఈ పరిస్థితి చాలా స్పష్టంగానే కనిపిస్తుంటే..రానరాను ఇది మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు. వెరసి సంక్షేమ పథకాలను ఒక్కటొక్కటిగా అయినా ఆపేయాలి. లేదా.. ఏదైతే అదే అయ్యిందిలే అని అన్ని పథకాలను ఒకేసారి అపేయాలి. ఇలా కాదనుకుంటే.. ఇక సీఎం పదవికి రాజీనామా చేసేయడం మినహా జగన్ ముందు మరో మార్గం లేదనే చెప్పాలి.
Must Read ;- ఉద్యోగులపై కోపమేల?.. క్రమశిక్షణే రాజమార్గం!











