బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండోసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న దాదా మూడు రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఆదివారం వైద్యులు ఆయన్ను ఇంటికి పంపించేశారు. ఛాతీలో స్వల్ప అస్వస్థతతో బుధవారం గంగూలీ ఆసుపత్రిలో చేరారు. గురువారం మరో రెండు స్టెంట్లు వేశారు. ప్రముఖ కార్డియాలజిస్టులు డా.దేవి శెట్టి, డా.అశ్విన్ మెహతాలు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. “గంగూలీ ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఆపరేషన్ తర్వాత అతని హృదయం ఒకప్పటిలానే మంచిగా పనిచేస్తోంది. దాదా అనుకున్నదానికంటే త్వరగానే కోలుకున్నారు. ఇదెంతో శుభపరిణామం. అతి త్వరలోనే ఆయన పూర్తిగా సాధారణ స్థితికి వస్తారనే నమ్మకం ఉంది. కొద్దికాలంపాటు గంగూలీ మందులు వాడాలి.” అని అపోలో వైద్య బృందం వివరించింది.
Must Read ;- గంగూలీకి అందుకే హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? ఆ వార్తల్లో వాస్తవమెంత?