టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రి పాలు కావడం కొత్త చర్చకు దారి తీస్తోంది. అతనిపై రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడి ఉందని.. అందుకే హార్ట్ ఎటాక్ వచ్చిందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ.. ఆ ప్రచారంలో వాస్తవమెంత? గంగూలీ రాజకీయ రంగప్రవేశంపై అతని సన్నిహితులు ఏమంటున్నారు? నిజంగానే
దాదాపై ఆ ఒత్తిడి ఉందా?
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి సౌరవ్ గంగూలీపై రాజకీయ నాయకుల దృష్టిపడింది. తన కుమారుడితో ఉన్న స్నేహం కారణంగా అమిత్‌షా.. గంగూలీతో మాట్లాడేవారు. రాజకీయాల్లోకి రావాలంటూ రెండేండ్ల క్రితమే గంగూలీని ఆహ్వానించినట్లు వార్తలొచ్చాయి. తన ప్రణాళికలో భాగంగానే గంగూలీని బీసీసీఐ అధ్యక్షుడిగా అమిత్‌షా చేశారని గుసగుసలు కూడా వినిపించాయి.
అమిత్ షా పాచిక వేశారా?
2021 ఏప్రిల్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమత దీదీకి గట్టిపోటీనిచ్చే వ్యక్తి దాదానే అనే అభిప్రాయంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకత్వం ఉన్నది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న బీజేపీలోని ముఖ్యపోటీదారులుగా భావిస్తున్న దిలీప్ ఘోష్, తథాగత రే, స్వపన్ దాస్ గుప్తా, బాబుల్ సుప్రియోలు మారు మాట్లాడకుండా ఉండేలా అమిత్ షా పాచికలు వేశారు. ఆ మేర గంగూలీతో దోస్తీ చేసేందుకు అమిత్‌షా కుమారుడైన ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జే షాతో పావులు కదిపారు.
ఆ భేటీతో రాజకీయ దుమారం..
సౌరవ్ గంగూలీ పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. గంగూలీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంగూలీ గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. గవర్నర్‌తో భేటిపై దాదా స్పందించారు. “గవర్నర్ ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించాలని అనుకున్నారు.. కానీ అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నందున అది సాధ్యం కాదని చెప్పాను. వచ్చేవారం స్టేడియాన్ని సందర్శించడానికి రావాలని గవర్నర్‌ను కోరగా.. ఆయన అంగీకరించారు. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమే” అని గంగూలీ స్పష్టం చేశారు.
రాజకీయ పరామర్శలు!
సౌరవ్ గంగూలీ ఆరోగ్యానికి సంబంధించి పలు వార్తలు గుప్పుమనడంతో గంగూలీ కుటుంబసభ్యులతో అమిత్‌షా, కైలాస్ విజయవర్గియా వంటి బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపి.. ఉత్తమ చికిత్స కోసం గంగూలీని న్యూఢిల్లీకి తీసుకురావాలని, అందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుందని అభయం ఇచ్చినట్లు తెలిసింది. గంగూలీ దవాఖానలో చేరిన వార్త వినగానే అటు గవర్నర్ ధన్‌కర్.. ఇటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇద్దరూ గంగూలీని పరమార్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాఉండగా, బీజేపీ మాత్రం తమ ముఖ్యమంత్రి అభ్యర్థి గంగూలీనే అనే విషయాన్ని స్పష్టం చేయకపోతుండటం బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
దాదా ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కానీ త్వరలోనే అతనికి మరో యాంజియోప్లాస్టీ చేయక తప్పదని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి ఎండీ, సీఈవో డా.రూపాలీ బసు వెల్లడించింది. స్వల్ప గుండెపోటుతో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ శనివారం ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే! అతని గుండె రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించిన వైద్యులు అందులో ఒకదాన్ని తొలగించడం కోసం స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే. తొమ్మిది మంది సభ్యుల సీనియర్ వైద్యుల బృందం సోమవారం అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మరో యాంజియోప్లాస్టీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. “కొన్ని రోజుల్లో లేదా కొన్ని వారాల్లో గంగూలీకి తప్పనిసరిగా మరో యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. బుధవారం ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించే అవకాశం ఉంది. ఇంటికి వెళ్లాక కూడా అతని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటాం. ప్రస్తుతం అతనికి ఎలాంటి ఛాతీ నొప్పి లేదు” అని రూపాలీ పేర్కొంది.
గంగూలీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఏమంటున్నారు?
కొన్ని పార్టీలు గంగూలీ క్రేజ్‌ను వాడుకోవడానికి యత్నిస్తున్నాయని ఆయన మిత్రుడు ఆరోపించారు. ఈ క్రమంలోనే అతను ఒత్తిడికి గురై గుండెపోటుకు గురయ్యారని తెలిపారు. ‘కొన్ని పార్టీలు గంగూలీని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయి. అది కచ్చితంగా గంగూలీపై ఒత్తిడి తేవడమే. అతనేమీ పొలిటికల్ లీడర్ కాదు. గంగూలీని ఒక స్పోర్ట్స్ ఐకాన్‌గా మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. పాలిటిక్స్‌లో రావొద్దని గత వారమే గంగూలీకి సూచించా. నా అభిప్రాయాలకు ఆయన అడ్డు చెప్పలేదు. లక్షలాది అభిమానుల్లాగే గంగూలీ త్వరగా కోలుకోవాలని నేనూ ప్రార్థిస్తున్నా” అని గంగూలీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భట్టాచార్య పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీని పరామర్శించిన వెంటనే.. భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Must Read ;- శర్మగారి అబ్బాయి బీఫ్ తిన్నాడా? ట్వీట్ల దుమారంలో నిజమెంత?