బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రాత్రి నుంచి అసౌకర్యంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కుదురుగానే ఉందని.. గురువారం నాడు ఆయనకు మరొక స్టెంట్ పెడతారని తెలుస్తోంది. మరొకసారి యాంజయోప్లాస్టీ చేయాలా లేదా అనే విషయాన్ని కూడా వైద్యులు ఇంకా తేల్చలేదు.
అసలేం జరిగిందంటే…
జనవరి 2న
గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. ఉదయం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుండగా వాంతులు, తలనొప్పి, ఛాతినొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట స్టంట్ వేశారు. రెండు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగతా పూడికలను తొలగించేందుకు మరికొన్ని రోజుల తర్వాత యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అప్పుడు వైద్యులేమన్నారు?
“జనవరి 6న దాదాను డిశ్చార్జి చేసేముందు తొమ్మిది మంది సీనియర్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు సమావేశమైంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చించింది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని బోర్డు సభ్యులు భావించారు. ఈ బోర్డు సమావేశంలో ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ దేవి శెట్టి, కేఆర్ పాండా వర్చువల్ వేదికగా హాజరయ్యారు.
అమెరికా నుంచి మరో వైద్య నిపుణుడు కూడా ఫోన్‌లో పాల్గొన్నారు.” అని గంగూలీ డిశ్చార్జి సందర్భంగా ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రూపాలీ బసు తెలిపారు.