వరుస ఓటములు ఎన్ని ఎదురైనా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ పంథాను మార్చుకోవడంలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా బలహీనపడింది. తెలంగాణ తెచ్చిన పార్టీ అయిన టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వస్తే, తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపిన బీజేపీ పార్టీయేమో నాలుగు ఎంపీ స్థానాలు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, కొత్తగా దుబ్బాక విజయంను కైవసం చేసుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు పర్యాయాలు ప్రతిపక్షంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా కానీ టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే విమర్శల తీరు మాత్రం మారడంలేదు. ప్రజల అభిమానం గెలుచుకోవడంలో వెనుకబడే ఉంది.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై రేవంత్ రెడ్డి విమర్శల దాడి చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ పాలు నీళ్లలాగే ఎప్పుడూ కలిసే ఉంటాయని ఆరోపించారు. అలాగే దుబ్బాకలో బీజేపీ విజయం వన్ టైం వండర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చడం ఎవరితరం కాదని వ్యాఖ్యానించారు. ఇలా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజీకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు సాధారణ విషయమే అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి లాంటి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి ఇలా చౌకబారు ప్రకటనలను చేయడం తన రాజకీయ మనుగడకే ప్రశ్నార్థకం చేస్తాయంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పాలు-నీళ్లు, దుబ్బాక వన్‌టైం వండర్ లాంటి విమర్శలు చేయడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా దుబ్బాక ప్రజలు బీజేపీని ఎంచుకున్నరనేది సత్యం. ప్రజల అభిమానాన్ని మూటగట్టుకోవడంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా ఎంతసేపు ఆ రెండు పార్టీలపై ఇలాంటి సాదాసీదా ప్రకటనలు రేవంత్ రెడ్డి స్థాయి లాంటి నేత చేయడమేంటనే చర్చ జరుగుతోంది.
Must Read: ఆరోపణలపై తొడకొట్టిన రేవంత్
మరోపక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత కపిల్‌సిబాల్.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదని వ్యాఖ్యానించారు. అంటే తమ పార్టీ జాతీయ నాయకత్వమే ఇన్‌డైరెక్ట్‌గా తాము బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని అంటుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి మరికొంత మంది నేతలు వాస్తవాలను గ్రహించకుండా పాతపోకడలతో, పాత చింతకాయ పచ్చడిలాగా దశాబ్దకాలం క్రితం నాటి రాజకీయ ఎత్తుగడలనే నమ్ముకుంటున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దుబ్బాకలో బీజేపీ విజయం, టీఆర్ఎస్ ఓటమితో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయనే చెప్పాలి. ఎందుకంటే దుబ్బాక ఓటమి తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇంటి పన్నులో రాయితీని కల్పించింది.
అలాగే వరద సాయాన్ని మళ్లీ కొనసాగించింది. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రూ.3వేల వేతనాన్ని పెంచేలా నిర్ణయం తీసుకుంది. అలాగే ఆర్‌టిసి ఉద్యోగులకు కరోనా సమయంలో పెండింగ్‌లో ఉన్న రెండు నెలల 50 శాతం వేతనాన్ని వెంటనే చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా ప్రభుత్తం వెనువెంటనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుకాల దుబ్బాక ఓటమియే ప్రధాన కారణమనే చర్చ ఉంది. మరీ అలాంటప్పుడు బీజేపీ విజయం వన్‌టైం వండర్ అని, బీజేపీ-టీఆర్ఎస్ రెండూ పాలు-నీళ్లే అని రేవంత్ రెడ్డి ఎలా ఆరోపిస్తారనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ గ్రహించాలంటున్నారు. ఏం చేస్తే తమ పార్టీ ప్రజల అభిమానాన్ని చూరగొంటుందో తెలుసుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేసే దిశగా సరికొత్త రాజకీయ పంథాను ఎంచుకుని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొంటే గానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరనే వాదన ప్రజల్లో బలంగా వినబడుతోంది.
Also Read: ఆపరేషన్ ఆకర్ష్‌తో బీజేపీ జోష్..