చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ రావణకాష్టంగా మారుతోంది. ఇక్కడ ప్రధానంగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గాల మధ్య ముఠాతగాదాలు, యుద్ధాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గుముఖం పట్టడం లేదు. ఏ అవకాశం వస్తుందా.. దానికి ముడిపెట్టి.. బలప్రదర్శనకు దిగుదామా.. అవతలి వారితో గొడవ పెట్టుకుందామా? అనే తరహాలో ఇరువర్గాలూ పందెంకోళ్లలా కాళ్లు దువ్వుతున్నాయి. తాజాగా నవంబరు 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవంతో ముడిపెట్టి.. నియోజకవర్గాన్ని యుద్ధరంగంగా మారుస్తున్నారు.
వేటపాలెం మండలం పందిల్లపల్లిలో ఆమంచి కర్ణం బలరాం వర్గాల మద్య శనివారం గొడవలు చెలరేగాయి. ఇరు వర్గాలు బాహాబాహికి దిగి కొట్టుకున్నారు. తోపులాట జరిగింది. కర్ణం బలరాం పుట్టిన రోజు సందర్భంగా కర్ణం బలరాం వర్గం నాయకులు, ఆమంచి స్వగ్రామం పందిల్లపల్లిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చీరాల, వేటపాలెంనుండి బారి ఎత్తున పంపదిల్ల పల్లికి కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ఆమంచి నివాసం వద్దకు ర్యాలీ చేరుకోగానే జై కర్ణం బలరాం అంటూ కేకలు వేశారు. పోటీగా జై ఆమంచి అంటూ అక్కడే ఉన్న ఆమంచి వర్గీయులు నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టారు.
నవంబర్ 1 రాష్ట్ర అవతర ణ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన ఉత్సవాలు నిర్వ హించేందుకు కార్యకర్తలతో ఆమంచి కృష్ణ మోహన్ సమావేశం నిర్వ హిస్తున్న సమయంలో ఇలా జరిగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చీరాలలో వాతావరణం శృతి మించుతుండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏఎస్పీ రవిచంద్ర ఆమంచి నివాసానికి చేరుకుని ఆమంచికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అయినా రచ్చ పెద్దదైంది..
అయినా ఫలితం కనిపించలేదు. ఇరువర్గాలు మరోసారి బాహాబాహికి దిగినాయి. మాటలతో రెచ్చగొట్టుకోవడంతో పాటు కర్రలతో రాల్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆమంచి వర్గానికి చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరువర్గాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు డిఎస్పీలు, 4సిఐలు, 10ఎసైలు, 50మంది పోలీసు సిబ్బంది ఉన్నా గొడవలు జరగకుండా అదుపు చేయలేక పోయారు. గాయపడ్డ ఆమంచి వర్గీయున్ని హాస్పిటల్ కు తరలించారు.
రంగంలోకి దిగిన ఎస్పీ
ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చీరాల పోలీస్ స్టేషన్ కు చేరుకుని అక్కడినుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు వైసీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహిస్తుండ టంతో ఎస్పీ అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
ఆమంచి స్వగ్రామం పందిల్లపల్లిలో పోలీసులు పికేటింగ్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మళ్లీ కొట్లాటలు జరగకుండా చూసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. గ్రామం మొత్తం ఏక్షణం ఏం జరుగుతుందో అన్నట్టుగా తయారైంది.