జీహెచ్ఎంసీ ఎన్నికలు దాదాపు డిసెంబర్ నెలలోనే జరిగే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కంటే ముందే టీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహాలను ముందుగానే అమలుచేసేస్తోంది. బల్దీయా ఎన్నికల్లో ఈ సారి 100 నుంచి 130 సీట్లను టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి వంద సీట్ల కంటే ఎక్కువగానే గెలుచుకోబోతున్నట్లు గులాబీ బాసులు ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ కూడా గతంలో చాలా సార్లే చెప్పారు. ఎలాగైనా ఈసారి 100 సీట్ల కంటే తగ్గకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్వీళ్లూరుతున్నారు. దీనికోసం ఇప్పటికే తమ ఎన్నికల వ్యూహాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే డివిజన్ బాధ్యతలను అప్పగిస్తూ ఇతర జిల్లాల నేతలను రంగంలోకి దింపుతున్నారు.
బాధ్యులుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు..
జిహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్లకుగానూ ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో భాగంగా ఒక్కొక్క డివిజన్‌కు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ, మంత్రి, రాష్ట్ర నేతలను బాధ్యులుగా టీఆర్ఎస్ పార్టీ చేయనున్నది. వారంతా తమ పార్టీ అభ్యర్థులను గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుంది. ఇలా 150 డివిజన్లలో ప్రత్యేక ఇంఛార్జీలను, బాధ్యులను నియమించేలా గులాబీ పార్టీ స్కెచ్ వేసింది. అయితే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నియమిస్తే పార్టీలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తనుండటంతో అక్కడి వారిని ఇక్కడ.. ఇక్కడి వారిని అక్కడి బాధ్యతలను ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా మళ్లీ ఎగరేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పక్క వ్యూహంతో ఇలా ముందుకు వెళ్తుంది. ఎన్నికల సమాయత్తంలో భాగంగా శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అనుసంరించాల్సిన వ్యూహాలపైన వారు చర్చించారు. 8 డివిజన్లలోని ఒక్కోడివిజన్‌కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేను ఈ ఎన్నికల బాధ్యులుగా నియమిస్తామని మంత్రి మాట్లాడారు. అంతేకాకుండా తాను కూడా ఒక డివిజన్‌కు బాధ్యులుగా ఉంటూ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తామన్నారు. బల్దీయాలో మరోసారి గులాబీ జెండా ఎగరవేయడానికి ప్రతి నాయకుడు ఈ తరహాలో కలిసికట్టుగా పనిచేసేలా ముందుకుపోతామన్నారు. వీరి వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో లేదో చూడాలి మరి.
AlsoRead ;- బల్దియా కావాలంటే.. కేసీఆర్ మెట్లు దిగక తప్పదు!,
AlsoRead ;- జీహెచ్ఎంసీ సమరానికి ముందు.. మజ్లిస్‌తో వైరం మంచిదేనా?