తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా ‘అపర్ణ బాలమురళి‘ గురించే మాట్లాడుకుంటున్నారు. సూర్య కథానాయకుడిగా ఇటీవల ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ద్వారా విడుదలైన ‘సూరారై పోట్రు‘ సినిమాలో ఆమె నటన గురించి చర్చించుకుంటున్నారు. ‘డెక్కన్’ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో నెటిజన్లను పలకరించింది. కథాకథనాలను నడిపించిన తీరు .. పాత్రలను మలిచిన విధానం .. సహజత్వంతో కూడిన ఆవిష్కరణ ఈ సినిమా విజయానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.
ముఖ్యంగా సూర్యకి భార్య పాత్రను పోషించిన ‘అపర్ణ బాలమురళి’ పాత్ర ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ఆరంభంలో ఆమెను చూసినప్పుడు, గ్లామర్ పరంగా అంతంత మాత్రంగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ పెళ్లి చూపుల కోసం హీరో ఇంటికి తానే వచ్చే తొలి సన్నివేశంలోనే ఆమె నటన పరంగా మంచి మార్కులను కొట్టేసింది. తన మనసులోని భావాలను ఎలాంటి మొహమాటం లేకుండా సూటిగా చెప్పేసే పాత్రకు ఆమె జీవం పోసింది. ‘మాట కరుకేగానీ మనసు వెన్న’ అనే తరహాలో సాగే ఆ పాత్రను ఆమె బాగా రక్తి కట్టించింది.
Must Read: ‘ఆకాశం నీ హద్దురా’… విజయమే సరిహద్దురా !!
ఒక వైపున తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి కష్టపడుతూనే, మరో వైపున భర్త ఆశయ సాధనకి తన వంతు సహకారాన్ని అందించే సన్నివేశాలలో ఆమె సహజమైన నటనను కనబరిచింది. భర్త ఓడిపోకూడదనే ఆరాటం .. ఆయన గెలవాలనే ఆశ .. ఆయన డీలాపడిపోయిన ప్రతిసారి ఆయనలోని పట్టుదలను తట్టిలేపి ఉత్సాహంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేసే భార్య పాత్రలో అపర్ణ బాలమురళి అద్భుతంగా నటించింది. ఒకానొక సందర్భంలో భర్తకి ఓదార్పునిస్తూ ‘ఇదే నా ఇల్లు .. ఇది మాత్రమే నా ఇల్లు’ అనే మాటతో ఆమె ప్రేక్షకులను పూర్తిగా తన పాత్ర వైపుకు తిప్పుకుంది.
ఇంతవరకూ మలయాళ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చిన అపర్ణ బాలమురళికి, తమిళంలో ఇది మూడో సినిమా మాత్రమే. ఈ సినిమా హిట్ తో అక్కడ ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయట. పెద్ద బ్యానర్ల నుంచి .. పెద్ద హీరోలు చేయవలసిన సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసులను సైతం దోచుకుంది. తెలుగు తెరకి సాయిపల్లవి వంటి మరో ఆర్టిస్ట్ దొరికిందనే అంతా చెప్పుకుంటున్నారు. తెలుగు నుంచి కూడా అపర్ణ బాలమురళికి అవకాశాలు వెళ్తాయేమో చూడాలి.
Also Read: సినిమారంగానికి టీటీ చికిత్సలు… జనం జేబులకు ఓటీటీ వాతలు