ఒక ఎన్నిక.. ఒక్కోసారి ఒక్కో విధంగా పార్టీల గమనాన్ని నిర్దేశిస్తుంది. వ్యక్తుల ప్రాధాన్యంపైనా ప్రభావం చూపుతుంది. అభ్యర్థుల గెలుపోటములు పార్టీలోని కీలక వ్యక్తుల రాజకీయ భవితపై ప్రభావం చూపుతాయి. ఏ ఎన్నికల్లోనైనా గెలిచిన వారితోపాటు.. గెలిపించిన వారికి ఉండే విలువ వేరు..ఏ వ్యక్తి అయితే తమ అభ్యర్థులను గెలిపించినట్లు పార్టీ భావిస్తుందో వారినే ప్రజల్లో ప్రమోట్ చేస్తుంది. ఎలా గెలిచామనేది కాదు.. గెలిచామా లేదా అనే అంశం ఇక్కడ ముఖ్యం. ఇక పార్టీని నడిపించే వ్యక్తి విషయానికి వస్తే.. ఆ వ్యక్తిని మరింత కీలకస్థానంలో కూర్చోబెట్టే ఆలోచన పార్టీకి ఉంటే.. సదరు వ్యక్తి చూపే పెర్ఫామెన్స్ మరింత మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి అదేనన్న చర్చ రాజకీయ పార్టీల్లో నడుస్తోంది.
ప్రస్తుత GHMC ఎన్నికల్లో కేటీఆర్ అన్నీ తానై నిర్వహిస్తున్నారు, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా, మంత్రిగా, కేసీఆర్ కుమారుడిగా ఏక కాలంలో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా సరే..2016లో గెలిచిన 99 స్థానాలకంటే ఎక్కువ గెలుస్తామని పార్టీ చెబుతోంది. అలా గెలిస్తేనే KTR ఛరిష్మా పెరుగుతుంది. లేని పక్షంలో విమర్శలు మరింత పెరగడంతోపాటు..రానున్న కాలంలో KTR చేపట్టే అవకాశం ఉన్న ‘ముఖ్య’ బాధ్యతల విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
2016 GHMC ఎన్నికల్లో కేసీఆర్ కంటే కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. స్టార్ క్యాంపెయినర్ గా రేయింబవళ్లు పర్యటనలు చేశారు. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీచేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడిగా లోకేష్ పోటీచేశాడు. అయితే టీడీపీ 94చోట్ల పోటీచేయగా 1 చోట మాత్రమే గెలిచింది. 51స్థానాల్లో రెండో స్థానంలో, 24 చోట్ల మూడో స్థానంలో, 14చోట్ల నాలుగో స్థానంలో నిలిచింది. అప్పట్లో లోకేష్ పై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ఇమేజ్ కూడా డామేజ్ అయింది. ఇక టీఆర్ఎస్ మాత్రం 99 చోట్ల గెలిచింది. ఆ గెలుపుతో KTRని పార్టీ వర్గాలు ఆకాశానికెత్తాయి. తరువాతి కాలంలో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా మరికొన్ని కీలక భూమికలు పోషించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ అందుబాటులో లేని సమయంలో అవసరాన్ని బట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ (దీన్నే కేబినెట్ మీటింగ్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి) కూడా పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే కేసీఆర్ తరువాత నెంబరు2గా కొనసాగుతున్నారు. మరోవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తే.. రాష్ట్రంలో కేటీఆరే ‘ముఖ్య’భూమిక పోషిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పట్టణాభివృద్ధి మంత్రిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ గా, కేసీఆర్ తనయుడిగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో కంటే ఒక్కసీటు తగ్గినా, మేయర్ స్థానం దక్కించుకున్నా సాంకేతికంగా గెలుపుకావచ్చు..కాని ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు పెంచడం ఖాయం. ఈ నేపథ్యంలోనే పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆయా ఎమ్మెల్యే పరిధిలోని డివిజన్లలో గెలుపు బాధ్యతను వారికే అప్పజెప్పింది. ఆ 99మందిలో 9 మందికి తప్ప మిగతా చోట్ల సిట్టింగ్ లకే సీట్లు ఇచ్చింది. ఇక బుధవారం జరిగిన మీటింగ్ లో కేసీఆర్, గురువారం జరిగిన మీటింగ్ లోనూ కేటీఆర్ ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిందనని పరోక్షంగా ఆ పార్టీ లీడర్లకు, ఇన్ ఛార్జిలకు బాధ్యతలు అప్పజెప్పారు. అంతే కాకుండా ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలతోపాటు నగరంలో బీజేపీ దూకుడు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కు ఒకరకంగా సవాలే అని చెప్పాలి. ఇక ఇటీవలే హైదరాబాద్ లో పలు కాలనీలను వరదలు ముంచెత్తాయి. ఆ పరిహారం విషయంలో రగడ నడుస్తోంది. ఇలాంటి సమయంలో GHMC ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంతో టీఆర్ఎస్ గనుక 100 స్థానాలు సాధిస్తే.. కేటీఆర్ కు పార్టీలో సమీపకాలంలో ఎవరూ సరితూగలేని పరిస్థితి ఉంటంది.
అటు మంత్రి, పార్టీ అధ్యక్షుడిగా నిరూపించుకోవడంతోపాటు రాజకీయపార్టీలకు గుండెకాయలాంటి హైదరాబాద్ ను గెలుచుకోవడం కేటీఆర్ కు పెద్ద సవాలే అని చెప్పవచ్చు. 99కంటే ఒక్కటి తక్కువ వచ్చినా పార్టీ పరంగా, కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ ను పార్టీ సమర్థించవచ్చు..కాని విమర్శలు తప్పవు. అలా కాకుండా 99కంటే ఎక్కవు వస్తే.. ప్రజామోదం అనే నినాదం తెరపైకి వస్తుంది. దీంతో ప్రతిపక్షాలకు పెద్దగా విమర్శించే అవకాశం ఇవ్వకుండానే కేటీఆర్ ‘ముఖ్య’భూమికను పోషించవచ్చు. అదే టైంలో పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తరువాతే ఎవరైనా అనేది మరోసారి రుజువు అవుతోంది.