విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బటయ పడింది. జగ్గయ్యపేట క్రిష్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మకు కరోనా సోకింది. దీంతో భర్త గడ్డయ్య మే 15న ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. భర్త గడ్డయ్య ఆమెకు కావాల్సిన అన్ని వస్తువులు అందించి జగ్గయ్యపేట వెళ్లిపోయారు. మరలా పదిహేను రోజుల తరవాత ఆయన వచ్చి ఆసుపత్రి సిబ్బందిని విచారించగా మార్చురీలో చూడాలని చెప్పారు. గడ్డయ్య మార్చురీలో ఓ మహిళ మృతదేహం చూసి అది తన భార్యదేనని భావించాడు. సిబ్బందికి చెప్పగా ఆ శవాన్ని గడ్డయ్యకు అప్పగించారు. భార్య శవాన్ని జగ్గయ్యపేట తీసుకెళ్లిన గడ్డయ్య జూన్ 1 వ తేదీన పెద్ద ఖర్మ పూర్తి చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయట పడింది. చనిపోయిందనుకున్న గిరిజమ్మ జూన్ రెండో తేదీ తిరిగి రావడంతో అందరూ షాకయ్యారు.
అసలేం జరిగింది..
గడ్డయ్య భార్య గిరిజమ్మను మొదటగా చేర్పించిన ఆసుపత్రి వార్డులో కనిపించకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో చూడాలని చెప్పారు. గడ్డయ్య మార్చురీలో కరోనా శవాన్ని సరిగా చూడకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ శవం అప్పగించారు. ఇందులో గడ్డయ్య శవాన్ని సరిగా గుర్తించకపోవడం ఒక తప్పయితే, సిబ్బంది నిర్లక్ష్యం మరో తప్పు ఉంది. దీంతో చనిపోయిందనుకున్న గిరిజమ్మ స్థానంలో మరో శవానికి, అప్పటికే కరోనాతో చనిపోయిన కొడుకుకు ఒకేసారి పెద్ద ఖర్మ నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. జరగాల్సిన తప్పు జరిగిపోయాక ఇక విచారణ జరిపించినా పెద్దగా ప్రయోజనం దక్కకపోవచ్చు. కాని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మరొకరు బలికాకుండా ఉండే అవకాశం ఉంది.
Must Read ;- కరోనా రోగి ఆత్మహత్య.. విమ్స్‌లో ఘటన











