కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కాస్త వయస్సు మళ్లిన వారికే ఎక్కువ ప్రమాదం అనే మాట తొలినుంచి వినిపిస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి ఈ ప్రమాదం ఎక్కువ అని డాక్టర్లు కూడా చెబుతున్నారు. అదే సమయంలో వృద్ధులను ఎక్కడా అనుమతించడం లేదు కూడా. ఆలయాలు తెరచినా, మెట్రో తెరచినా, ఎక్కడా వృద్ధులకు అనుమతి లేదు. ఒకవైపు వృద్ధులు కూడా ఇంట్లోంచి కదలకుండా జాగరూకతతో ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో వృద్ధులకు చాలా పెద్ద శుభవార్త లాంటి వార్త ఇది.
వృద్ధులకు కూడా బాగా పనిచేసే కరోనా వాక్సిన్ వచ్చేసింది.
మోడెర్నా mRNA-1273 వాక్సిన్ అనేదాని విషయంలో ఇప్పటిదాకా జరిగిన టెస్టులన్నీ కూడా పాజిటివ్ ఫలితాన్నే ఇచ్చాయి. తాజాగా ఈ టీకా.. వృద్ధుల్లో సైతం వైరస్ ను చంపే యాంటీబాడీలను తయారుచేస్తుందని తేలింది. యువతలో ఏ మోతాదులో అయితే యాంటీ బాడీలు తయారౌతాయో.. అదే స్థాయిలో వృద్ధుల్లో కూడా యాంటీబాడీలు తయారుచేస్తున్నట్టు పరిశీలనలు చెబుతున్నాయి. కాకపోతే సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వృద్ధుల్లో మోడెర్నా టీకా పనిచేసే తీరుపై ఇంగ్లాండ్ లో NIAIDకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధన నిర్వహించింది. ఆ ఫలితాలను అక్కడి న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ అండర్సన్ మాట్లాడుతూ.. అన్ని రకాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు.
71 ఏళ్లు దాటిన వృద్ధులపై 100 మైక్రోగ్రాములను 28 రోజుల తేడాతో ప్రయోగించారు. వారిలో కూడా యువతతో సమానంగా యాంటీబాడీలు తయారైనట్లు గుర్తించారు. నిజంగా ఇది వయసు పైబడిన వారికి చాలా పెద్ద శుభవార్త.
ఎంత గొప్ప విషయం అంటే..
వృద్ధులకు కొవిడ్ సోకితే చాలా మంది వైద్యానికి సరిగా రెస్పాండ్ కావడం లేదు. కొండొకచో చాలా భారీగా వ్యయం అవుతోంది. కొవిడ్ విజృంభించగా కేవలం.. కొవిడ్ చికిత్సలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఇన్సురెన్సు పథకాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఇన్సురెన్సులు ఏవీ కూడా 60 ఏళ్లు మించిన వారికి వర్తించకుండా నిబంధనలు పెట్టారు. అంటే.. కొవిడ్ నేపథ్యంలో వృద్ధుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. వృద్ధుల గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు ఆశా కిరణంలాగా ఈ మోడెర్నా టీకా రావడం గొప్ప విషయం.











