గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది.వైసీపీ ఎంపీ రఘురామరాజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసిన రెండు రోజులకే గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి బదిలీ చర్చనీయాంశంగా మారింది.తాను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వెంటనే డిశ్చార్చ్ చేసి మరలా అరెస్టు చేసేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి,తిరుమల జేఈవో ధర్మారెడ్డి,ఆర్మీ ఆసుపత్రి రిజిష్ట్రార్ కలసి కుట్ర పన్నారని ఎంపీ రఘురామరాజు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.తాను ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు గుంటూరు నుంచి వచ్చిన 15 మంది పోలీసులు కూడా ఆర్మీ ఆసుపత్రిలోనే భోజనాలు చేశారని, ఆ బిల్లులు కూడా ఎంపీ రఘురామరాజు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు ఇచ్చారు.ఆ బిల్లుల వివరాలను కూడా ఆయనకు ఫిర్యాదుతో పాటు జత చేసి ఇచ్చారు.దీనికి తోడు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా నోటీసులు జారీ చేయడంతో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని తప్పించి మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారని తెలుస్తోంది.
గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్
గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అమ్మిరెడ్డిని వీఆర్‌కు పంపిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కేంద్రం నుంచి వచ్చిన తాఖీదుల కారణంగా ఆ ఆకస్మిక బదిలీ చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా అమ్మిరెడ్డి బదిలీతో సీఐడీ అధికారుల్లోనూ ఆందోళన మొదలైందని తెలుస్తోంది.
Must Read ;- ఆ ముగ్గురూ కుట్ర చేశారు : రఘురామరాజు సంచలన ఆరోపణలు!











