నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సొంత పూచీకత్తు,ఇద్దరు జామీనుదారులతో,లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది.గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.ఈ కేసుకు సంబంధించి కొన్ని షరతులను పెట్టింది.దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలని చెప్పడంతో పాటు న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని,ఈ కేసుకు సంబంధించి మీడియాతో,సోషల్ మీడియాతో మాట్లాడకూడదని షరతలు విధించింది.విచారణకు సహకరించాలని,దర్యాప్తును ప్రభావితం చేయకూడదని పేర్కొంది.ఎఫ్ఐఆర్ నమోదైనందున కస్టోడియల్ ఇంటారాగేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కస్టడీలో దురుసుగా ప్రవర్తించారని న్యాయస్థానం అభిప్రాయ పడింది.కాగా రాజద్రోహం కేసుకు సంబంధించిన అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
పోటాపోటీగా రోహత్గీ,దవే వాదనలు
అంతకుముందు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది.ఇందుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాడి దవే వాదనలు వినిపించగా పిటిషనర్ తరఫున న్యాయవాది రోహత్గీ తన వాదనను వినిపించారు.సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్ చదివి వినిపించారు.రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయిందని,మెడికల్ బోర్డు రిపోర్టుకు,ఆర్మీ ఆస్పత్రి చెకప్‌కి మధ్య ఏదైనా జరిగి ఉండవచ్చని ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే అనుమానం వ్యక్తం చేయగా కస్టడీలో చిత్రహింసలు నిజమేనని తేలిందని ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా పలు ప్రశ్నలను సంధించింది. రఘురామ తనకు తాను గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించింది.తొలివిడత విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే కోరగా,తక్షణమే విచారణ పూర్తి చేయాలని రోహత్గీ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముకుల్ రోహిత్గీ కోర్టును కోరారు.కాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టులో జనరల్ ఎడిమా ఉందని,కాలి వేలుకి ఫ్రాక్చర్ ఉందని తేలింది.
మే 14న ఎంపీ రఘురామ అరెస్టు
కాగా మే14న ఎంపీ రఘురామకృష్ణ రాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఇతరులతో కలసి కుట్ర చేయడం(ఐపీసీ సెక్షన్ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజద్రోహానికి పాల్పడడం (124ఏ)తోపాటు 153ఏ, 505 అభియోగాలు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించి మెజిస్ట్రేట్ కోర్టు,ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి.ఈ సందర్భంగా తమను పోలీసులు కొట్టారని రఘురామ సంచలన ఆరోపణలు చేయడంతోపాటు కాలికి గాయాలనుకూడా చూపించారు.దీనిపై స్పందించిన న్యాయస్థానం గుంటూరు ఆసుపత్రితోపాటు రమేష్ ఆసుపత్రిలోనూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు చేయించిన ప్రభుత్వం ఆ నివేదికనే హైకోర్టుకు అందజేసింది.ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు రాష్ట్రప్రభుత్వంపై, సీఐడీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.అదే సమయంలో బెయిల్ కోసం రఘురామకృష్ణ రాజు సుప్రీంను ఆశ్రయించారు.తొలుత గాయాలకు సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు సుప్రీం ఆదేశించింది.బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కాగా ఎలాంటి గాయాల్లేవని ఎడిమా అయి ఉండవచ్చని గుంటూరు ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికకు,ఆర్మీ ఆసుపత్రి నివేదికకు ఉన్న తేడాలేంటి అనే అంశం కూడా చర్చకు వస్తోంది.
హోంమంత్రికి లేఖ..
కాగా తన తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ కేంద్ర హోంమంత్రికి,లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించింది స్పీకర్ కర్యాలయం రఘురామకృష్ణ రాజు అరెస్టు,ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని సభా హక్కుల కమిటీతో పాటు హోంశాఖకూ రిఫర్ చేసినట్టు తెలుస్తోంది.అనుమతికి సంబంధించి కూడా పరిశీలించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
Must Read ;- రఘురామ కాలికి ఫ్యాక్చర్ తో పాటు మరికొన్ని గాయాలు : సుప్రీంకోర్టు











