తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఏది చేసినా ప్రత్యేకమనే చెప్పాలి. ఏ పదవిలో ఉన్నా… అసలు పదవి ఉన్నా… లేకపోయినా కూడా నిత్యం జనంతోనే మమేకమై ఉండే హరీశ్ రావు… జనంలో ప్రత్యేక ముద్ర సంపాదించుకున్నారు. సిసలైన రాజకీయవేత్తగా తనను తాను తీర్చిదిద్దుకున్న హరీశ్ రావు తీరు కూడా ఆసక్తికరమేనని చెప్పక తప్పదు. మంత్రి పదవి దక్కినప్పుడు పొంగిపోవడం తెలియదు… పదవి రానప్పుడు కుంగిపోవడం కూడా తెలియని నేతగా హరీశ్ కు మంచి మైలేజీ ఉన్న సంగతీ తెలిసిందే. ఇదంతా ఇప్పుడెందుకు అంటే… మంత్రి హోదాలో ఉన్న హరీశ్… గురువారం రైతు అవతారం ఎత్తి పొలంలోకి దిగి మరీ విత్తనాలు చల్లుతూ రైతన్నలకు అవగాహన కల్పించారు కాబట్టి.
మెజారిటీలో రికార్డులు సృష్టిస్తూ..
2004లో సిద్ధిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా ప్రత్యక్ష బరిలోకి ఎంట్రీ ఇచ్చిన హరీశ్ రావు… వరుసగా ఆరు పర్యాయాలు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తూనే వస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా పోటీ చేసే నేతలకు ఎప్పుడో అప్పుడు మెజారిటీ తగ్గే అవకాశంతో పాటు ఏకంగా జనం నిరసన వ్యక్తమైతే ఓటమి చెందే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఈ తరహా అభిప్రాయాలను పటాపంచలు చేసిన హరీశ్ రావు… 2004 నుంచి ప్రతి సారీ తన మెజారిటీని పెంచుకుంటూనే వస్తున్నారు. మొన్నటి 2018 ఎన్నికల్లో ఆయనకు ఏకంగా 1.20 లక్షల ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం.
వెదజల్లే పద్దతిలో వరిపై అవగాహన కల్పిస్తూ…
ఇంతగా అప్రహతిహాతంగా విజయాలు సాధిస్తున్న హరీశ్ రావు… ఏ రీతిన ఈ మేర సత్తా చాటుతున్నారనడానికి గురువారం నాడు ఆయనకు చెందిన ఓ ఫొటో నిలువెత్తు నిదర్శనంగా మారిందని చెప్పక తప్పదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్… గురువారం ప్రారంభమైన ఏడో విడత హరితహారంలో భాగంగా తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలోని కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామ శివారులోని రైతు యాట నర్సింలు పొలంలో రైతు నేస్తం అవతారం ఎత్తారు. మంత్రి అన్న ఫోజులను ఏమాత్రం దరిచేరనీయని హరీశ్… హరిత హారంలో భాగంగా రైతులకు సరికొత్త సాగు పద్దతులను పరిచయం చేసే క్రమంలో రైతు అవతారం ఎత్తారు. కాళ్లకున్న చెప్పుల్ని తీసేశారు. ప్యాంటును పిక్కల దాకా మడిచేశారు. పల్లెంలో విత్తనాలను తీసుకుని వెదజల్లే పద్దతిలో వరిని ఎలా సాగు చేయాలన్న విషయాన్ని చూపుతూ… విత్తనాలను చల్లారు. ఈ ఫొటోలు వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- వైరల్ పిక్!.. రేవంత్‌తో సూరీడు!