తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.సైలెంట్ నేతగా పేరున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్…తెర వెనుక తనదైన మంత్రాంగం నడుపుతున్నారన్న భావనతో టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్… ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు.ఈ క్రమంలో తనదైన స్పీడు చూపించాలనుకున్న ఈటలకు.. మంత్రి గంగుల కమలాకర్ రూపంలో కేసీఆర్ ఓ గట్టి దెబ్బే కొట్టారు.కేసీఆర్ రచించిన ఈ వ్యూహంలో భాగంగా గంగుల ఓ రేంజి స్పీడుతో వెళుతుండగా…ఈటల మాత్రం విలవిల్లాడిపోతున్నారు.ఇందుకు నిదర్శనంగానే…సంయమనం కోల్పోయిన ఈటల గంగులపై గతంలో ఎన్నడూ లేని రీతిలో ఘాటు వ్యాఖ్యలకు దిగారు.మొత్తంగా కేసీఆర్ వ్యూహానికి ఇప్పుడు ఈటల పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పెరిగిన అంతరం
టీఆర్ఎస్‌లో మంత్రి హరీశ్ రావు ప్రాభవం కాస్త తగ్గిన నేపథ్యంలో ఆ ప్లేస్‌ను ఆక్రమించడంతో పాటుగా పార్టీలో నెంబర్ 2గా ఎదిగేందుకు ఈటల యత్నించారని అధిష్ఠానం భావించింది.ఈ క్రమంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అసలు ఈటలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉండాలని కూడా కేసీఆర్ భావించినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇంతటి కఠిన నిర్ణయం ఇప్పుడప్పుడే ఎందుకులే అనుకున్న కేసీఆర్.. తన కేబినెట్‌లో ఈటలకు చోటిచ్చారు. అయితే ఆ తర్వాత ఎందుకనో గానీ…కేసీఆర్,ఈటల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోయింది.ఈ నేపథ్యంలో చడీచప్పుడు లేకుండా ఓ ఫైన్ మార్నింగ్ ఈటలపై అవినీతి ఆరోపణలను సాకుగా చూపిన కేసీఆర్ ఆయనను తన మంత్రివర్గం నుంచి తొలగించేశారు.అయితే ఇలాంటి పరిణామం ఎప్పుడో అప్పుడు తనకు తప్పదన్న భావనతోనే ఉన్న ఈటల తనదైన ప్రత్యామ్నాయాన్ని కూడా రెడీ చేసుకున్నట్లుగా సమాచారం.
Must Read ;- ఈటల పొలిటికల్ హీట్.. కొండా సురేఖతోనూ మంతనాలు
హుజూరాబాద్‌లో గంగుల ఎంట్రీ..
ఈ క్రమంలో మంత్రివర్గం నుంచి మాత్రమే తొలగింపునకు గురైన ఈటల ఇంకా టీఆర్ఎస్‌లోనే ఉన్నారు.సాంకేతికంగా పార్టీలోనే ఉన్నా…ఈటల ఇప్పుడు టీఆర్ఎస్‌కు తొలి శత్రువేనని చెప్పాలి.ఇలాంటి క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కాస్తంత పేరు ప్రఖ్యాతులున్ననేతలను వరుసగా కలుస్తూ కేసీఆర్‌కు తనేంటో చూపే యత్నాలను ఈటల చేశారు.దీనిని గమనించిన కేసీఆర్…తనదైన మార్కు వ్యూహాన్ని రచించడంతో పాటుగా వెనువెంటనే అమల్లోకి తీసుకొచ్చేశారు.ఈ ప్లాన్ ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ను ఈటలపైకి వదిలేశారు.ఇంకేముంది..అధినేత ఆదేశాల ప్రకారం ఎంట్రీ ఇచ్చేసిన గంగుల..ఈటలపై ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు.ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో ఆయనను ఒంటరిని చేసే పనిని మొదలెట్టేశారు.అప్పటిదాకా తన వెంట నడిచిన నేతలు ఒక్కొక్కరుగా గంగుల శిబిరంలో చేరిపోతున్న వైనంతో ఈటల నిజంగానే షాక్‌కు గురయ్యారు.
గంగులపై ఈటల ఘాటు వ్యాఖ్యలు
ఇంకొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉంటే తన పుట్టి మునగడం ఖాయమనుకున్నారో,ఏమో తెలియదు గానీ.. ఈటల సహనం కోల్పోయి నోరు విప్పక తప్పలేదు.మంగళవారం మీడియా ముందుకు వచ్చిన ఈటల…నేరుగా గంగులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.హుజూరాబాద్‌లో తనను ఒంటరిని చేసే యత్నాలు ఫలించవని చెబుతూనే.. గంగుల సాగించిన అవినీతి మొత్తం తన గుప్పెట్లో ఉందని,సరైన సమయం చూసుకుని దానిని బయటపెట్టేస్తానని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా మరో అడుగు ముందకేసి 2023 నాటికి గంగుల అసలు రాజకీయాల్లోనే లేకుండా పోతారని కూడా శాపనార్థాలు పెట్టేశారు.అంతేకాకుండా కేసీఆర్ చేతిలో ఎప్పుడో ఒకప్పుడు తన మాదిరే గంగుల కూడా మోసపోతారని కూడా భవిష్యవాణి చెప్పేశారు.ఈ క్రమంలో కేసీఆర్ ఎలాగైతే కోరుకున్నారో…అదే మాదిరిగా ఈటల పూర్తిగా సహనం కోల్పోయారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈటల శాపనార్థాలు పెడుతూ,హెచ్చరికలు జారీ చేస్తూ అడ్డంగా బుక్కైపోయారు.దీంతో కేసీఆర్ అంతా తాను అనుకున్నట్లుగానే జరుగుతోందని,ఈటల ఆత్మరక్షణలో పడిపోయారని,అందులో భాగంగానే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సంబరపడిపోతున్నారు.
Also Read ;- AskKTRలో ఎక్కువ వైద్య ఆరోగ్యశాఖవే.. ఈటల తర్వాత ఆయన లైన్‌లోకి