తాన్యా రవిచంద్రన్.. తెలుగు తెరకు కొత్త పేరిది. కార్తికేయ హీరోగా రూపొందుతున్న ‘రాజా విక్రమార్క’ తో పరిచయమవుతోంది. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా రూపొందుతున్న ఈ సినిమా తాన్యాకు ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి. అసలు తాన్యా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు లాంటి విషయాలు చూద్దాం. ఈమె చెన్నై చిన్నది. అక్కడ పీజీ చేస్తున్న సమయంలోనే అవకాశాలు వచ్చాయి. అలా అక్కడే మూడు సినిమాల్లో నటించాల్సి వచ్చింది. దర్శకుడు శ్రీ సరిపల్లి దృష్టి ఆమె పడటంతో చెన్నై వెళ్లి కథ చెప్పారట. వెంటనే ఆమె ఓకే చెప్పేసింది. ఇందులో ఆమె కాంతి అనే పాత్రను పోషించింది.
తను నేర్చుకున్న క్లాసికల్ డ్యాన్స్ ఈ పాత్ర చేయటానికి ఎంతో ఉపయోగపడింది. కాంతి పాత్ర కూడా భరతనాట్యం డ్యాన్సర్. హోంమంత్రి కూతురి పాత్ర ఇది. ఈ సినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఏ ఏజెంట్ గా నటించారు. మరి హోంమంత్రి కూతురితో ఈ ఏజంట్ కు ఎలాంటి కనెక్షన్ ఉందన్నది సినిమాలోనే చూడాలంటోంది ఈ భామ. ఇంతకీ తాన్యా రవిచంద్రన్ కు సినిమా నేపథ్యం ఉంది. ఆమె తాతయ్య రవిచంద్రన్ సినిమా హీరో. ఆయన కన్నుమూశారు. తనకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి అనీ, తాతయ్య ఇప్పుడు ఉండి ఉంటే బాగుండేదని అంటోంది.
తాతయ్యలో అంకిత భావం, క్రమశిక్షణ ఉండేవని, తాను కూడా వాటిని అలవర్చుకున్నానని చెబుతోంది. తన తల్లిదండ్రులకు తాను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, వారిని ఎలాగో ఒప్పించి సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది. తెలుగులో హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో ఈ భామ తెలుగు కూడా నేర్చుకుంటోంది. ‘ తెలుగు రాకపోవడం వల్ల ముందు కొంత భయపడ్డాను.
షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు నేను హైదరాబాద్ వచ్చాను. దర్శకుడు శ్రీ నాకు ఇంగ్లిష్ స్క్రిప్ట్ ఇచ్చారు. అలాగే డైలాగులకు అర్థం వివరించడంతో పాటు తెలుగు డైలాగులకు ఇచ్చాడు. నా పాత్ర డైలాగులు మాత్రమే కాదు… సన్నివేశంలో మిగతా ఆర్టిస్టుల డైలాగులు కూడా ఇచ్చారు. అందువల్ల, నా పని ఈజీ అయ్యింది’ అని వివరించింది ఆమె. తెలుగులో ఆమెకు ఇంకా ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
Must Read ;- బాలయ్యతో శ్రుతి.. ఆ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టరా?
https://www.youtube.com/watch?v=XuFtMh1Xmao











