కరోనా కోరలు చాచి.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దాని బారి నుంచి ఇప్పుడప్పుడే కోలుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అన్నిరంగాలు దీని దెబ్బకు కుదేలైపోయాయి. ముఖ్యంగా సామాన్య జనానికి వినోదాన్ని అందించే సినిమా పరిశ్రమ.. దాదాపు ఆరు నెలలనుంచి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఒక పక్క థియేటర్స్ తెరవక, మరో పక్క షూటింగులు జరగక .. భారతీయ సినిమా వెలవెల బోతోంది. ఈ పరిస్థితుల్లో ఇంటివద్ద ఉన్న జనానికి వినోదాన్ని అందిస్తూ.. ఓటీటీ దూసుకుపోతోంది.
ప్రస్తుతం వెండితెర నుంచి అరచేతిలోకి మారిన ఈ వినోద సాధనం భవిష్యత్తులో సినిమా రంగాన్నే శాసిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే.. థియేటర్‌లో చూసిన అనుభూతి .. ఓటీటీ ప్లాట్ ఫామ్ కు సాధ్యం కాదు కాబట్టి.. కరోనా గొడవ సద్దుమణిగాక.. జనం మళ్లీ థియేటర్ అనుభవాన్నే కోరుకుంటాడని .. తమ సినిమాలు థియేటర్స్ లోనే విడుదల చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న కొందరు నిర్మాతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ లాక్‌డౌన్ నిబంధనలు పూర్తిగా సడలించి.. థియేటర్స్ తెరిస్తే.. ప్రేక్షకులంతా తిరిగి అక్కడికే పరుగులు తీస్తారా? లేక ఓటీటీలకే అలవాటు పడ్డారు కాబట్టి.. ఇంట్లోనే కూర్చుంటారా? అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు థియేటర్స్ తెరిచి.. జనాన్ని పొలోమని వదలివేసే సాహసం ప్రభుత్వాలు చేయవు. ఒకవేళ చేసినా.. సోషల్ డిస్టెన్స్ , నిబంధనలు, ప్రమాణాలు అంటూ… సవాలక్ష కండీషన్లు పెడతాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు ప్రాణాలకు తెగించి థియేటర్స్ కు వచ్చే పరిస్థితి లేదు.
అయితే ఈ సమస్య ఎప్పటికి తీరుతుంది? మళ్లీ థియేటర్స్ ప్రేక్షకులతో ఎప్పుడు కళకళలాడుతూ కనిపిస్తాయి.? అని ప్రశ్నిస్తే .. సమాధానం లేదు. అందుకే ఈ పరిస్థితుల్లో కొందరు నిర్మాతలు .. ఓటీటీల కోసమే ప్రత్యేకంగా సినిమాలు నిర్మిస్తున్నారు.. అలాగే.. పలువురు స్టార్ డైరెక్టర్స్ .. వెబ్ సిరీస్ సెక్షన్ లోకి కన్వర్ట్ అయిపోతున్నారు. అంతేకాదండోయ్.. స్టార్ హీరోలు సైతం.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం అందుతోంది.
అలాగే.. దీనికి సమాంతరంగా.. ఏటీటీలు కూడా తయారవుతున్నాయి. అంటే ఎనీ టైమ్ థియేటర్స్ అన్నమాట. గతంలో బడ్జెట్ లేక సగంలో ఆగిపోయిన కొన్ని సినిమాల్ని .. ఆ నిర్మాతలే.. ఒక టికెట్ ధర పెట్టి.. తమ సొంత ప్లాట్ ఫామ్ లో విడుదల చేసే ఈ పద్ధతిని చాలా మంది చిన్న నిర్మాతలు ఫాలో అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, రామ సత్యనారాయణ లాంటి కొందరు ఈ ఏటీటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఓటీటీల్లోనూ, ఏటీటీల్లోనూ చిన్న నిర్మాతలు, మినిమమ్ రేంజ్ సినిమాలు తీసే నిర్మాతలు తమ సినిమాల్ని విడుదల చేయగలరు కానీ.. భారీ సినిమాలు తీసే బడా నిర్మాతల పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. వారు ఖచ్చితంగా తమ సినిమాల్ని థియేటర్స్‌లోనే విడుదల చేయాలి. అందుకే కొందరు స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారని..ఆ మేరకు ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులేస్తున్నారని సమాచారం. సో.. మరి భవిష్యత్తులో సినిమా యథావిధిగా థియేటర్స్ కే తిరిగి వస్తుందో .. లేక ఓటీటీల ఆధీనంలోనే ఉంటుందో చూడాలి.










