విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండకి గల విపరీతమైన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, తనదైన శైలిలో పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఓ డాన్ కి అతని కొడుక్కి మధ్య ఈ కథ నడుస్తుందని అంటున్నారు. మదర్ సెంటిమెంట్ ను కూడా టచ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తయింది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు తిరిగి మొదలుకానుంది.
తదుపరి షెడ్యూల్లో విజయ్ దేవరకొండ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఒక భారీ సెట్ లో ఈ చిత్రీకరణ జరగనుంది. అండర్ గ్రౌండ్ కి సంబంధించినదిగా చూపించే ‘డాన్ సెట్’ ఇది. ఈ సెట్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఈ నెల చివరికి ఈ సెట్ నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో వున్నారు. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి విజయ్ దేవరకొండ రంగంలోకి దిగిపోతున్నాడు. ఆయనతో పాటు ముఖ్య తారాగణం కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననుంది.
యాక్షన్ కి రొమాన్స్ ను జోడించి పూరి రూపొందిస్తున్న ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ జోడీగా ‘అనన్య పాండే’ నటిస్తోంది. ఒక కీలకమైన పాత్రలో ‘రమ్యకృష్ణ’ కనిపించనుంది. ఇంతకుముందు పూరితో కలిసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలతో మణిశర్మ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాడు. ఆయనే ఇప్పుడు ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. బైక్స్ పై సాగే ఛేజింగ్ సీన్ .. లారీల నేపథ్యంలో సాగే యాక్షన్ సీన్ .. గూడ్స్ రైల్ పై చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.
AlsoRead ;- హీరో విజయ్ దేవరకొండ చూపు బాలీవుడ్ వైపు