నేరాలు చేసినా జైళ్ళకు వెళ్ళకుండా చట్టసభలోల కూర్చునే వారికి ఈ వార్త కాస్త నిరాశ కలిగించేదే. నేరస్తులుగా ఉండి ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న వారికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు. తాజాగా సీబీఐ, ఏసీబీ, ఎమ్మెల్యే, ఎంపీలు కే్సుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించనట్టు సమాచారం.
ఫాయిదా కోసమేగా వాయిదా…
కేసుల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు వాయిదా ఓ కిటుకుగా మారుతోంది రాజకీయ నాయకులకు. దేశ వ్యాప్తంగా ఎంపీలు , ఎమ్మెల్యేలపై అనేక కేసులు పేరుకు పోయాయి. నిందితులుగా ఉన్న వారు ఓటర్లను ప్రభావితం చేసి ఎన్నికల్లో గెలుపొంది ఆ తరువాత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం అలవాటుగా మారిపోయింది. ఒకవేళ ప్రభుత్వం తన పార్టీదే అయితే తనపై ఉన్న కేసులను ఏళ్ళతరబడి వాయిదాలు వేయిస్తూ, అధికార దర్పం ప్రదర్శించడం కామన్ అయ్యింది. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కూడా విచారణ చేపట్టగా, ఎమ్మెల్యేలు, ఎంపీలపై విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి కేసులను సత్వరమే తీర్పులు వచ్చేలా చూడాలని సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు సైతం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశాన్ని పరిశీలించి సత్వర ఏర్పాటుకు పూనుకోవాని సూచించింది.
క్రిమినల్ కేసులతోనే అసలు సమస్య…
ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా జీవితంతో అనేక కేసులు ఎదుర్కొవాల్సి వస్తోంది . కొన్ని అనుకోకుండా వారిపై వచ్చి పడేవి కాగా, మిగిలిన వాటిలో నేరుగా తమ ప్రమేయం ఉండటం.. మరెవరితో అయినా నేరాలు చేయించడం వంటి కేసులు నమోదు అవుతున్నాయి. అయితే సుప్రీం కోర్టు ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉంటే రాజ్యాంగ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్న భావనలో ఉంది. నేరాలు చేసిన వారు ప్రజా ప్రతినిధులుగా ఉంటే తీర్పులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనేక మార్లు కోర్టు తలుపులు తట్టాయి ఎన్జీవో సంస్థలు.
విచారణలో వేగం పెంచేస్తాం…
తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం సైతం నేరస్థులైన ప్రజా ప్రతినిధుల పై విచారణ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ అంశంపై ప్రధాని మోడీ సైతం సీరియస్ గా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అసవరం అయితే చట్టాన్ని తీసుకు వచ్చి ఈ అంశపై సత్వర నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నారు. సుప్రీం కోర్టు సైతం ఇదే అంశంపై హైకోర్టులకు ఆదేశాలు జారీ చేయడంతో నేరాలకు పాల్పడిన రాజకీయ నాయకుల గుండెలదురుతున్నాయి. నాయకుల ఆలోచనలు ఎలా ఉన్న హైకోర్టు నిర్ణయంతో రాజకీయ నేరగాళ్ళ నుంచి తమకు త్వరలోనే విముక్తి లభిస్తుందున్న భావనలో ప్రజలున్నారు. వీలైనంత త్వరగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడిన ఏ రాజకీయ నాయకుడికైనా తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు.











