దుబాయి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. అటు బౌలింగ్ లో రాణించి పంజాబ్ ను ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేసిన చెన్నై బ్యాటింగ్ లో సూపర్ ప్రదర్శన చేసింది. దీపక్ చాహర్, శామ్ కరణ్, శార్దూల్ ఠాకూర్, జడేజా, చావ్లాతో కూడిన బౌలింగ్ విభాగం తమ సత్తా చాటింది. ఇదే సమయంలో గాయం నుంచి కోలుకున్న బ్రేవో తిరిగి జట్టులో చేరడం చెన్నై జట్టుకి ప్రధాన బలంగా నిలిచింది. లైన్& లెంత్ మెయింటైన్ చేస్తూ చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలలో 178 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చెన్నై ఓపెనర్ల సూపర్ షో
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు ఓపెనర్లు వాట్సన్, డుప్లిసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. చక్కని టైమింగ్ తో వీరిద్దరూ ఎదురుదాడి చేశారు. వీరి దూకుడుగా పంజాబ్ బౌలర్లు గతి తప్పారు. కాట్రేల్, షమీ, జోర్డాన్ లాంటి ఇంటర్నేషనల్ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో బాటు వేగంగా ఆడటంతో చెన్నై లక్ష్యాన్ని కేవలం 17.4 ఓవర్లలలోనే ఛేదించింది. వాట్సన్ 53 బాల్స్ లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేయగా, డుప్లిసిస్ 53 బాల్స్ లోనే 11 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 87 పరుగులు చేసి చెన్నైకి ఘన విజయాన్ని అందించారు.
వీరిద్దరూ మొదటి వికెట్ కు 181 పరుగులు జోడించారు. దీంతో ఐపీఎల్ లో అత్యధిక భాగ్యస్వామ్య జాబితాలో వీరి కాంబో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే
1) గౌతమ్ గంబీర్-క్రిస్ లీన్ (కోలకతా నైట్ రైడర్స్) -184 పరుగులు (2017)
2) వాట్సన్- డుప్లిసిస్ ( చెన్నై సూపర్ కింగ్స్)- 181 పరుగులు (2020)
3) సచిన్-డ్వెన్ స్మిత్ ( ముంబై ఇండియన్స్)-163 పరుగులు (2012)
4) గిల్ క్రిస్ట్- లక్ష్మణ్ ( దక్కన్ ఛార్జర్స్)- 155 పరుగులు (2008)
వికెట్ నష్టపోకుండా వాట్సన్- డుప్లిసిస్ చేసిన 181 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ కు అత్యధికం. మైఖల్ హస్సి, మురళి విజయ్ పేరిట ఉన్న ఈ రికార్డును వాట్సన్- డుప్లిసిస్ బద్దలు కొట్టారు.
1) వాట్సన్- డుప్లిసిస్ – 181 పరుగులు (2020)
2) హస్సి- విజయ్- 159 పరుగులు (2011)
3) హస్సి- విజయ్- 139 పరుగులు (2013)
4) వాట్సన్ -రాయుడు 134 పరుగులు (2018)











