శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన “సోలో బ్రతుకే సో బెటర్” చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ లోని పాత్రికేయులతో కొద్దిసేపు చాలా సరదా ముచ్చటించారు. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే…
“సోలో బ్రతుకే సో బెటర్” చిత్రం చాలా చాలా ఎంటర్ టైనింగ్ ఉంటుంది. పెళ్లి గురించి ఆలోచించకుండా సోలోగా హాయిగా బతికేయాలనుకునే కుర్రాడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. వినోదానికి, ఫ్యామిలీ ఎమోషన్స్ కు అధిక ప్రాధాన్యమిస్తూ రూపొందిన చిత్రం కావడంతో అటు యూత్, ఇటు ఫ్యామిలీ వంటి అన్నిరకాల ప్రేక్షకులను అలరింపజేస్తుంది. “చిత్రలహరి” నుంచి నాకు మంచి కథలు వస్తున్నాయి. పేరెంట్స్ అడిగినప్పుడల్లా పెళ్లి వాయిదా వేసే అంశం ఉంటుంది కాబట్టి ఈ చిత్రంలోని నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని చెప్పగలను ఇందులో నాలుగు పాటలున్నాయి. తమన్ వీనుల విందైన సంగీతాన్ని అందించారు. అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది” అని చెప్పారు.
Must Read ;- మెగా ఫ్యామిలీ నుంచి తెరపైకి మరో హీరో.. !

ఇందులో ఏ పాట అంటే మీకు మరీ మరీ ఇష్టమని అడిగిన ప్రశ్నకు సాయిధరమ్ బదులిస్తూ, “నో పెళ్లి.. అనే పాట నాకు ఎక్కువ ఇష్టం. ప్రతీరోజు పొద్దు పొద్దున్నే ఆ పాటను మా ఇంట్లో సౌండ్ పెంచి పెడుతుంటాను. మా అమ్మ కూడా నన్ను పెళ్లి చేసుకోమని ఎప్పుడూ అంటుంటుంది. నేను వాయిదా వేస్తుంటాను. దానికి తోడు ఈ పాట వినగానే అమ్మకు కాస్త కోపం వస్తుంది. వెంటనే “నీకు కాఫీ ఇవ్వను. నీ కాఫీ నువ్వే పెట్టుకో” అని సరదాగా అంటుంది. వాస్తవానికి ఎలాంటి కుర్రాళ్లయినా పెళ్లిని కొంతకాలం పాటు వాయిదా వేయగలరే కానీ ఇంట్లో పేరెంట్స్ వత్తిడితో నైనా ఏదో ఒకరోజ్జు ఒప్పుకోక తప్పదు కదా!” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
“సుబ్బు తను ఎంత బాగా కథ చెప్పారో అంత బాగా తీశారు. ప్రసాద్ గారు రాజీపడకుండా నిర్మాణ విలువలకు అంత్యంత ప్రాధాన్యమిచ్చి నిర్మించారు. మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ కారణంగా ఇంతకాలం వాయిదా పడింది. జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు రావాలి. థియేటర్లు తిరిగి కళ కళ లాడాలి. థియేటర్లో సినిమా చుస్తే ఆ అనుభూతి ఎలా ఉం టుందో అందరికీ తెలిసిందే. చిత్రం విడుదలైన తొలి రోజు ఒకటీ, రెండు థియేటర్లకు వెళ్లాలని అనుకుంటున్నాను. మా ముగ్గురు మావయ్యలకు వీలుకుదిరితే ఈ చిత్రాన్ని చూపించాలన్న ఆలోచన కూడా ఉంది” అని వివరించారు.
మీ ఇంట్లోనే మీ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరో కావడంతో మీకు పోటీగా భావించడం లేదా? అన్న ప్రశ్నకు సాయిధరమ్ స్పందిస్తూ, “అలాంటిదేమీ లేదు. ఒక చెట్టుకు అనేక పూలు పూస్తాయి. అలాగే ఎవరి కెరీర్ వారిదే. మా తమ్ముడు, నేను సినిమాల గురించి అసలు చర్చించుకోము. ఇద్దరం చాలా స్నేహంగా ఉంటాం” అని అన్నారు.
తదుపరి చిత్రం ఎంతవరకు వచ్చింది? వివరాలు ఏంటి? అని అంటే..“దేవ కట్టా దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం 60 శాతం పూర్తయింది. ఇది కూడా ఓ మంచి చిత్రమవుతుంది. ప్రేక్షకాభిమానులను అలరింపజేసేలా ఉంటుంది” అంటూ ముగించారు.
Also Read ;- వకీల్ సాబ్, ఉప్పెన రిలీజెస్ పై క్లారిటీ వచ్చేసింది..!












