ఐఏఎస్‌గా అటు రిటైర్ అయిపోవడం.. ఇటు జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా మారిపోవడం.. ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా సలహాదారులుగా నియమించుకున్న వారి సేవలనైనా బాగా వినియోగించుకుంటున్నారా? అంటే.. అదీ లేదాయే. అంతేకాదండోయ్.. అడ్వైజర్లుగా మారిపోయిన రిటైర్డ్ ఐఏఎస్‌లకు ఎప్పుడు పదవీ గండం ముంచుకొస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే ఇలా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ సేవలను అవసరమనుకున్నంత కాలం బాగానే వినియోగించుకున్న జగన్ సర్కారు.. ఆ తర్వాత ఆయనను అవమానపరిచి, పదవికి రాజీనామా చేసేలా వ్యవహరించింది. జగన్ సర్కారు తీరుతో బాగా నొచ్చుకున్న పీవీ రమేశ్ సింగిల్ మెసేజ్ తో జగన్ కు గుడ్ బై కొట్టేశారు. మరి ఇప్పుడు పీవీ మాదిరే జగన్ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న అజేయ కల్లం కూడా పదవి నుంచి తప్పుకునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సీఎస్‌గా నెల సర్వీసే
ఐఏఎస్ అధికారిగా పలు కీలక పోస్టుల్లో పని చేసిన అజేయ కల్లం.. సమర్థవంతమైన అధికారిగానే పేరు తెచ్చుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అజేయ కల్లం.. నల్లగొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, విశాఖ పట్నం జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ గా, టీటీడీ ఈవోగానూ పనిచేశారు. అంతేకాకుండా పలు కీలక శాఖలకు కమిషనర్ గా, ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సీఎంఓలోనూ పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ కేడర్ ను ఎంచుకున్న అజేయ కల్లంకు చంద్రబాబు సర్కారు మంచి పోస్టింగులే ఇచ్చింది. తన సర్వీసు ముగిసిపోతున్న సమయంలో 2017 మార్చి 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు చంద్రబాబు సర్కారు కీలక పోస్టు అప్పజెప్పింది. అయితే ఆ తర్వాత ఒక నెలకే ఆయన పదవీ విరమణ చేశారు. అజేయ కల్లం సర్వీసును ఆరు నెలల పాటు పొడిగించాలన్న చంద్రబాబు సర్కారు వినతిని కేంద్రం అంగీకరించకపోవడంతో సీఎస్ గా నెల సర్వీసు పూర్తి కాగానే అజేయ కల్లం పదవీ విరమణ పొందారు.
జగన్ రాగానే అడ్వైజర్ పోస్టు..
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం కాగానే.. అజేయ కల్లంకు ప్రభుత్వ సలహాదారుగా పదవి దక్కింది. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత మరోమారు ఆయన సేవలను పొడిగించారు. అయితే ఇప్పుడు అజేయ కల్లం సేవలు తమకు అవసరం లేదన్నట్లుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన వాణిజ్య ఉత్సవ్ సందర్భంగా కేబినెట్ ర్యాంకులోని అజేయ కల్లంకు కూడా ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానాన్ని మన్నించిన కల్లం కార్యక్రమానికి హాజరుకాగా.. ఆయనను అవమానపరిచే రీతిలో నిర్వాహకులు వ్యవహరించారట. వేదికపై ఎక్కడో ఓ మూలన కూర్చీ వేసి అజేయ కల్లంను ఆహ్వానిస్తే.. అందుకు ససేమిరా అన్న ఆయన వేదిక ఎక్కకుండా.. కిందే కూర్చుండిపోయారట. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా జగన్ సర్కారుకు అజేయ కల్లంపై మోజు తీరిందని, ఇక నేడో, రేపో ఆయన పదవికి రాజీనామా చేయక తప్పదన్న విశ్లేషణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పీవీ రమేశ్ కు ఎదురైన అనుభవాలను కూడా వారు గుర్తు చేస్తున్నారు. మరి పీవీ రమేశ్ మాదిరి పదవి నుంచి పీకేయకముందే అజేయ కల్లం పదవికి రాజీనామా చేస్తారా? లేదంటే మెడబట్టి గెంటేయించుకుంటారా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జగన్‌కు ఇంకో అడ్వైజర్ రెడీ