పరిషత్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ మీద ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విసిరిన సవాల్ కు స్పందిస్తారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని వైసీపీ శ్రేణులు ఆదివారం నుంచి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి అన్న భావనతో సోమవారం నాడు జగన్ మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రజలు తమను మరోమారు దీవించారని, ఈ ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని.. ఓ రేంజి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా తమకు దక్కిన విజయం ఇక ఏ పార్టీకి సాధ్యం కాదని, విపక్ష టీడీపీ పని అయిపోయిందన్న కోణంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే.. ఏపీలో జరిగిన పరిషత్, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు ఏ రీతిన జరిగాయన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమా?
ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది. ఎన్నికలు జరిగిన తీరు ఎలాంటిదో అందరికీ తెలిసిందేనని, ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు కాకుండా మరెలాంటి ఫలితాలు వస్తాయని ఎదురు దాడికి దిగింది. మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ స్ట్రాటజీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలు జరిగిన తీరు, వైసీపీ చంకలు గుద్దుకుంటున్న తీరుపై సుధీర్ఘ చర్చే జరిగింది. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను క్లీన్ స్వీప్ చేశామని చెబుతున్నారు కదా.. మరి అదే దమ్ముతో అసెంబ్లీని రద్దు చేద్దాం రండి. ఎన్నికలకు వెళదాం రండి. ఎవరి బలం ఏమిటో తెలుస్తుంది అంటూ జగన్ కు సవాల్ విసిరారు. ప్రజామోదం పూర్తిగా తమకే అంటున్న వైసీపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని, అప్పుడు ఎవరి బలం ఎంతో తేలుతుందని వ్యాఖ్యానించారు. మరి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వచ్చే దమ్ము వైసీపీకి గానీ, జగన్ కు గానీ ఉందా? అని కూడా చంద్రబాబు సవాల్ విసిరారు.
బాబు సవాల్ కు మౌనమే సమాధానం
జనంలో పూర్తి మద్దతు ఉందని చెబుతున్న వైసీపీ.. ప్రత్యేక హోదా కోసం గానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా గానీ.. రాజీనామాలు చేద్దాం రమ్మని టీడీపీ పిలుపు ఇస్తే స్పందించనే లేదు. రాజీనామాలు చేయం, కేవలం ఆయా అంశాలపై కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు పరిషత్ ఎన్నికలు గెలిచారు కదా.. మరి అసెంబ్లీ ఎన్నికలకు వెళదాం రండి అంటూ చంద్రబాబు చేసిన సవాల్ కు కూడా వైసీపీ నుంచి సమాధానం వచ్చే అవకాశాలే లేవు కదా అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఇంకా రెండున్నరేళ్ల పాలన ఉండగా.. అప్పుడే ఎన్నికలకు వచ్చే సాహసం వైసీపీ చేస్తుందా? అన్న విశ్లేషణలూ సాగుతున్నాయి. ఓ వైపు ప్రజల్లో జగన్ పాలనపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సవాల్ కు జగన్ స్పందించే సాహసం కూడా చేయరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ అభివృద్ధి ముమ్మాటికీ జీరోనే