ఎమ్మెల్యేగా గెలవకుండానే పశ్చిమ బెంగాల్ సీఎం పీఠమెక్కిన మమతా బెనర్జీ తన పదవికి ముప్పు రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాసనమండలి పునరుద్ధరణ అంశాన్ని తెరపైకి తెచ్చి అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో పాగా వేయలేకపోయిన బీజేపీ పెద్దలు ఆమెకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్ర హోంశాఖ వెంటనే సానుకూలంగా స్పందిస్తుందనేది సందేహమే. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఈ తీర్మానాన్ని అంత తేలికగా ఆమోదించి శాసనమండలిని పునరుద్ధరిస్తుందా అన్న అనుమానాలున్నాయి.
ఆరునెలల్లోపు ఎన్నికవకపోతే..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసినా మమత బెనర్జీ నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. తర్వాత సీఎంగా బాధ్యతలను స్వీకరించిన ఆమె నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. అక్టోబరులోగా శాసనసభకు ఆమె ఎన్నిక కావాలి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఏదైనా శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగకపోతే ఆమె సీఎం పదవికి గండం కులుగుతుంది. శాసనమండలి ఏర్పాటయితే మమత ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం పదవిలో కొనసాగవచ్చు. దీని కోసమే శాసనమండలి పునరుద్దరణను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. కాగా, ఆమె కోసమే ఈ తీర్మానం చేశారంటూ ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.
1969లో రద్దయిన శాసనమండలి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1969లో శాసన మండలి రద్దయింది. దీని పునరుద్ధరణకు తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభకు హాజరైన 265 మంది ఎమ్మెల్యేల్లో 196 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన బీజేపీ సభ్యుల అభ్యంతరాల మధ్యే ఈ తీర్మానం ఆమోదం పొందింది. తాము అధికారంలోకి వచ్చాక శాసన మండలిని పునరుద్ధరిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. కాగా, అందుకు అనుగుణంగా ఈ తీర్మానాన్ని ఆమోదించామని ఆమె అంటున్నారు. అసెంబ్లీ తీర్మానంపై ధిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Must Read ;- మోదీ VS ముఖ్యమంత్రులు.. పెరుగుతున్న అసంతృప్తి











