ప్రధాని నరేంద్ర మోదీని 2014 ఎన్నికల్లో ప్రధాన మంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ … ఇప్పుడు అదే మోదీని ప్రధాని పదవి నుండి దింపేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఓ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్న పీకే… తాజాగా మరింత స్పీడు పెంచేసినట్లుగా కనిపిస్తోంది.
మోదీ వ్యతిరేకులకు పీకే సాయం
మోదీకి తలొగ్గని నేతలుగా పరిగణిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహాలు అందించిన పీకే… దక్షిణాదిలో తమిళనాడుకు చెందిన డీఎంకేకు కూడా వ్యూహాలు అందించి ఈ రెండు పార్టీలకు విజయం దక్కేలా చేశారు. ఇక ఏపీలో జగన్ పార్టీకి ఇతోదికంగా సాయం చేసిన పీకే… తెలంగాణలో కేసీఆర్ తోనూ మంతనాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో సోమవారం ఢిల్లీలో ప్రశాంత్ కిశోర్… మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవాత్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పవార్ తో పీకే రెండో భేటీ
ఇదివరకే పవార్ తో ఓ దఫా చర్చలు జరిపిన పీకే… తాజాగా సోమవారం కూడా రెండో సారి భేటీ అయ్యారు. వారం రోజుల వ్యవధిలో వీరిద్దరూ రెండు సార్లు భేటీ కావడం ప్రాధాన్యతనను సంతరించుకుంది. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా ఈ భేటీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తొలుత జూన్ 11న ముంబయిలో శరద్ పవార్ నివాసంలో దాదాపు 3 గంటల పాటు సమావేశం జరగ్గా, తాజాగా ఢిల్లీలో అరగంట పాటు భేటీ అయ్యారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయపార్టీలు లేని థర్డ్ ఫ్రంట్ కు రూపకల్పన చేయడంపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. మోదీకి దీటైన ప్రధాని అభ్యర్థిని నిలపడంపైనా వీరు చర్చించినట్గుగా సమాచారం.
Must Read ;- పీకే డీల్‌కు నో అన్న చంద్రబాబు.. ఆర్కే కొత్త పలుకులో ఎన్నో కోణాలు