కొవిడ్ సెకండ్ వేవ్‌ను నియంత్రించే విషయంలో విఫలమయ్యారని ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోదీకి రానున్నకాలంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయా అనే చర్చ మొదలైంది.ఇందుకు కారణం కూడా ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల సీఎంలు మోదీతో తలపడుతున్నారు.కొవిడ్‌కు ముందు ధిల్లీ సీఎం కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సారథ్యంలోని కూటమి మోదీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి కనిపించింది. అయితే కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఆ రాజకీయ యుద్ధం కాస్త తగ్గినా తాజాగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులు ఫైర్ అయ్యారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ,ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్,కేరళ సీఎం పినరయి విజయన్‌లు లేఖలు రాశారు.
పలు రాష్ట్రాల సీఎంలకు పినరయి విజయన్ లేఖలు
ఇక కేరళ సీఎం పినరయి విజయన్ దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలకు కూడా లేఖలు రాశారు.కొవిడ్ నియంత్రణ విషయంలో,వ్యాక్సిన్ సరఫరా విషయంలో మోదీ సర్కారు విఫలమైందని చెప్పడంతో పాటు రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.ఇదే అంశంపై గతంలో మమతా బెనర్జీ కూడా పలు వ్యాఖ్యలు చేశారు.అన్ని అంశాలను తన గుప్పెట్లో పెట్టుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందని,రాష్ట్రాల సీఎంలను అవమానిస్తోందని విమర్శించారు . రెండేళ్ల క్రితం ధిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే తరహా కామెంట్లు చేశారు.అప్పట్లో ఈ కామెంట్లను రాజకీయ విమర్శలుగా భావించినా ప్రస్తుతం వ్యాక్సిన్ల సరఫరాలో వివక్ష చూపుతున్నారన్న విమర్శలున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీపై,కేంద్రం పై చేస్తున్న విమర్శలు చర్చకు కారణం అవుతున్నాయి. వ్యాక్సిన్లు రాష్ట్రాలే సమకూర్చుకోవాలని కేంద్రం చెప్పిన అంశంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ యుద్ధ ట్యాంకులు కూడా రాష్ట్రాలే సమకూర్చుకోవాలా అన్ని ప్రశ్నించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కూడా కేంద్రంపై పరోక్ష విమర్శలు చేయడంతో ఇరుకున పడిన బీజేపీ దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు వినిపిస్తున్న వ్యతిరేక గళంతో మరింత ఇబ్బంది ఎదుర్కొవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాగా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్‌పై మోదీ చిత్రాన్ని ఇప్పటికే పంజాబ్,చత్తీస్‌ఘడ్,ఝార్ఖండ్‌లు తొలగించి కేంద్రంతో వార్‌కు సిద్ధమయ్యాయనే చర్చ నడుస్తున్నవేళ తాజా పరిణామాలపైనా చర్చ నడుస్తోంది.
Must Read ;- దిగజారిన మోదీ ప్రతిష్ట.. ఎందుకో తెలుసా?
దక్షిణాది విషయానికి వస్తే..
ఇక దక్షిణాది విషయానికి వస్తే కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలో ఉండడంతో ఇబ్బంది లేదు.ఏపీ విషయానికి వస్తే ఝార్ఖండ్ సీఎం మోదీని విమర్శిస్తే.. ఏపీ సీఎం జగన్ ఆ విమర్శలు తగదని ట్వీట్ చేయడాన్ని బట్టి కేంద్రంతో ఎలా వ్యవహరిస్తున్నారనేది అంచనా వేయవచ్చు.తెలంగాణ విషయానికి వస్తే వ్యాక్సిన్ల విషయంలో ఇప్పటికే కేంద్రాన్ని తప్పుబడుతోంది ఇక్కడి కేసీఆర్ సర్కారు.అంశాల వారీగా కేంద్రంతో సఖ్యత,లేదా విమర్శలు ఉంటాయని చెప్పవచ్చు. తమిళనాడులో కాంగ్రెస్,డీఎంకే స్నేహం ఇప్పటికే ఉంది.కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కావడం,స్టాలిన్ తొలిసారి సీఎం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో క్లారిటీ వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది.
మొత్తం మీద దక్షిణాదిలో కర్ణాటక,ఏపీ మినహా తమిళనాడు,కేరళ,తెలంగాణ ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.మహారాష్ట్ర(కాంగ్రెస్- NCP- శివసేన పొత్తు కొనసాగితే),ధిల్లీ, కేరళ, తమిళనాడు, ఝార్ఖండ్,చత్తీస్‌ఘడ్,పశ్చిమబెంగాల్,ధిల్లీ,పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మోదీతో ఢీ అంటే ఢీ అంటున్న తరుణంలో రానున్న కాలంలో రాజకీయ సమీకరణాలు ఎటువైపు దారి తీస్తాయనే చర్చ నడుస్తోంది.
Also Read ;- మోదీ వ్యాక్సిన్ ఫార్ములా.. అవసరమైనన్ని అందటం కష్టమే