ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నాయన్న ప్రచారం నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి థర్డ్ ఫ్రంట్ ద్వారా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను ఎదుర్కోవడం సాధ్యం కాదని, థర్డ్ ఫ్రంట్ అనేది పాత ఫార్ములా అని, ఆ ప్రయోగం ఇప్పటికే విఫలమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో థర్డ్ లేదా ఫోర్త్ ఫ్రంట్ సక్సెస్ అవుతుందని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు.
బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమేనన్న మెస్సేజ్..
కాగా ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో జరిగిన భేటీలో రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడామని చెప్పారు. ఒకరి గురించి ఒకరు అవగాహన పెంచుకునేందుకే ఈ భేటీ జరిగిందన్నారు. పది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ కావడంతో థర్డ ఫ్రంట్‌పై ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం జరిగిన చర్చల్లో బీజేపీ వ్యతిరేక పోరాటంపై రాష్ట్రాల వారీగా, అంశాల చర్చలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం ద్వారా దేశ వ్యాప్తంగా కొత్త సందేశం వెల్లిందని, బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమేనన్న మెస్సేజ్ దేశమంతా గమనించిందన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తాను రాజకీయ వ్యూహకర్తల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన పీకే మళ్లీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పిన విషయం తెలిసిందే.
శరద్ పవార్‌తో సుదీర్ఘ మంతనాలు
కాగా సోమవారం శరద్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా పార్టీకి చెందిన ముఖ్యనేతలకు, విపక్ష పార్టీలకు చెందిన 15 మందికి శరద్ పవార్ ఆహ్వానం పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా మంగళవారం మరోసారి పలువురు నాయకులు సమావేశం కానున్నారు. మంగళవారం ధిల్లీలో శరద్ పవార్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పలు రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యావేత్తలు, మాజీ దౌత్యాధికారులు, బాలీవుడ్ ప్రముఖులతోపాటు కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా కూడా హాజరుకానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పది రోజుల్లో రెండో సారి భేటీ
కాగా ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గత పది రోజుల్లో రెండుసార్లు భేటీ అయ్యారు. జూన్ 12న ముంబైలోని పవార్ నివాసంలో తొలిసారి భేటీ అయ్యారు. కాగా జూన్ 21న ధిల్లీలో రెండోసారి భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేని ఎదుర్కొనేందుకు ఫ్రంట్ ఏర్పాటు అవుతుందన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇక సోమవారం జరిగిన సమావేశంలో పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ విజయం, దీదీ విజయానికి ఉపయోగ పడిన వ్యూహాలు, తమిళనాడులోని పరిస్థితులు తదితర అంశాలపై చర్చ జరిగిందని చెబుతున్నారు. కాగా ప్రధాని అభ్యర్థి రేసులో శరద్ పవార్ పేరు ఇప్పటికే వినిపించగా కొన్నాళ్ల క్రితం మమతా బెనర్జీ పేరు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం జరగనున్న చర్చలో కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా కీలకంగా మారినట్టు వార్తలు వస్తున్నాయి.
Must Read ;- చాయ్ వాలాను ఢీకొట్టే నాయకుడి అన్వేషణ.. మోదీ అంటేనే మండిపడుతున్న పీకే











