జీహెచ్ఎంసీ ఎన్నికలకు సరిగ్గా ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అధికార, విపక్ష పార్టీలు తమ ప్రచారంలో స్పీడ్ పెంచాయి. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. అయితే అప్పుడే ఎన్నికల ఫలితాలపై కొన్ని సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? అని తమ సర్వే ఫలితాల్లో ముందస్తుగానే చెప్పేస్తున్నాయి.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వే సంస్థలు రంగంలోకి దిగి ఫలితాలపై దృష్టి సారిస్తాయి. ఓటింగ్‌కు ముందు, ఫలితాలకు ముందే ఇవి తమ అంచనాaను చెప్పేస్తుంటాయి. ఇలా అనేక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే దానిపై కొన్ని అంశాలను లెక్కలోకి తీసుకొని ముందస్తు సర్వేలు జరిపిస్తుంటారు. అయితే వీరు చెప్పిందే జరుగుతుందని, అలాగే జరగదని కూడా కొట్టిపారేయలేము. ఏదోక స్ట్రాటజీ ప్రకారం వారు చెప్పే ఫలితాలు నిజం కావొచ్చుకూడా. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా వారం రోజుల వరకు సమయం ఉంది. ఈలోపే ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంచనాలను(ఎగ్జిట్ పోల్స్) సర్వేలు బయటపెట్టేస్తున్నాయి. దీంతో అధికార,విపక్ష పార్టీలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాలు ఎక్కడ తమ గెలుపుపై ప్రభావం చూపిస్తాయోనని ఒకింత ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయట.
బీజేపీదే గెలుపట?..
జీహెచ్ఎంసీ ఎన్నికలపై చాణక్య సంస్థ ఈ నెల 22వ తేదీన సర్వే నిర్వహించింది. 150 డివిజన్లలో జరిపిన ఈ సర్వేలో 1.5 లక్షల మంది పాల్గొన్నట్లు తెలిపింది. ఆ సంస్థ జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించింది. భారతీయ జనతా పార్టీకు 46.2 శాతం ఓట్లతో 90-96 సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే మజ్లీస్ పార్టీకి 19.1శాతం ఓట్లతో 30-35 సీట్లు, టీఆర్ఎస్ పార్టీకి 16.9 శాతం ఓట్లతో 24-29 సీట్లు వస్తాయని పేర్కొన్నది. 10.7శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి 4-6 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని సర్వేలో తెలిపింది. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో చెప్పడం మాత్రం కష్టమే.
అలాగే మరికొన్ని సంస్థలు కూడా ఎన్నికలపై సర్వేలు జరిపాయి. అందులో టీఆర్ఎస్ పార్టీకే అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. అయితే రాజకీయ విశ్లషేకులు మాత్రం ఈ సర్వేలపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదంటున్నారు. సర్వేలను బేరీజు చేసుకుని ఓట్లు వేయొద్దని, ఎన్నికల జిమ్మిక్కులో భాగంగానే కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వేలు జరిపి జనాల్లోకి వదులుతారనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలంటే డిసెంబర్ 4వరకు వెయిట్ చేయాల్సిందే.
Must Read ;- గులాబీ కార్పొరేటర్లకు సర్వే గుబులు!