రోడ్డు పక్కనో.. పొలం గట్ల మీదనో.. ఏదైనా చెట్టు కనిపిస్తే, దాన్ని నరికేసి లాభాపడేవాళ్లు చాలామంది ఉంటారు. స్వార్థ ప్రయోజనాల కోసం భారీ చెట్లను కొట్టేస్తున్నా.. కనీసం ఒక్క మొక్కైనా నాటే ప్రయత్నం చేయరు. పచ్చని చెట్లు గొడ్డలికి వేటుకు బలవుతుంటే ‘నేనున్నానంటూ’ ఓ పెద్దాయన వచ్చారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే.. అక్కడ మొక్కలు నాటుతూ నాటి అశోకుడిని గుర్తుకుతెస్తున్నారు. తన జీవితమంతా మొక్కలు, చెట్లకే అంకితం చేసిన వనజీవి రామయ్య గురించి నేటి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొక్కలే ఆయన ప్రాణం
ఈయనది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం. దరిపెల్లి రామయ్య అంటే ఎవరికీ తెలియదు. అదే వనజీవి రామయ్య అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా గుర్తు పట్టేస్తారు. భార్య పేరు జానమ్మ. ముగ్గురు కొడుకులు, ఓ కూతరు ఉన్నారు. రామయ్యకు చిన్నప్పటుంచే చెట్లు, మొక్కలు అంటే చాలా ఇష్టం. ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో నుంచి ఎవరూ కదలరు. కానీ రామయ్య మాత్రం అసలు ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడడు. అడవుల్లోకి వెళ్లి మొక్కలు నాటేస్తుండటాడు. రకరకాల గింజలు, ఎవరూ చూడని విత్తనాలు. వాటన్నిటినీ సేకరించి బస్తాల్లో నింపి నిల్వ చేస్తారు. తొలకరి చినుకులు పడ్డత ర్వాత వాటిని నాటే కార్యక్రమంలో మునిగిపోతారు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ ప్రదేశాలు, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుతారు. కొన్ని వందల రకాల విత్తనాలు- అడవుల్లో తప్ప జనారణ్యంలో పెద్దగా తెలియని చెట్లెన్నో రామయ్య చేతుల మీదుగా పెరిగి వటవృక్షాలయ్యాయి.
బోర్డు తగిలించుకొని.. అవగాహన కల్పిస్తూ..
‘పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు’ చిన్నప్పుడు ప్రతిఒక్కరూ పాఠాల్లో చదువుకున్నాం. కానీ ఆచరణలో చూపేది ఎంతమంది అంటే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కానీ రామయ్య చెట్లతో చెలిమి చేస్తారు. వాటిని కాపాడతారు. ఇతరుల్లో అవగాహన కల్పిస్తాడు. అందుకే ‘వృక్షోరక్షతి.. రక్షిత’ అనే అట్ట బోర్డు తగిలించుకొని దర్శనమిస్తుంటాడు. ఎక్కడ చిన్నబోర్డు కనిపించినా, పాతరేకులు కనిపించినా ఈ సూక్తి రాసేస్తుంటారు. రామయ్య ఇంటి నిండా ఇలాంటి రాతలే కనిపిస్తాయి. అంతే కాదు.. సినిమా పాటలను, విప్లవ గీతాలను పేరడీ చేసి మొక్కల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా అన్వయించి పాడుతారు కూడా. తానే కాదు.. ఇంట్లోవాళ్లకు చెట్ల గురించి ఎన్నో కథలు చెబుతూ, వాళ్లచేత మొక్కలు నాటించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన కుటుంబ సభ్యులకు చెట్ల పేరు పెట్టారు. మనుమళ్లు, మనుమరాళ్లకుకూడా చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు.
50 ఏళ్లుగా అలుపెరగకుండా
ఒకటి కాదు.. రెండు కాదు.. 50 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నారు రామయ్య. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లేతుంటారు. రోడ్డుకు ఇరుపక్కలనే కాకుండా ఏదైనా ఖాళీ స్థలం కనిపించినా, గుట్టలపైనా ఈ వనజీవి విత్తనాలు చల్లి పర్యావరణాన్ని కాపాడుతుంటారు. చాలామంది ఆస్తులు.. అంతస్తులు అంటూ పరుగులు తీస్తుంటే.. రామయ్య మొక్కలు, చెట్లు అంటూ తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేశారు. కరోనా సోకినా.. బాధ్యతగా మొక్కలు నాటారు. అందుకే ఆయనకు పద్మశ్రీ వరించింది.
Must Read ;- తెలంగాణ రామప్పకు యునెస్కో గుర్తింపు!











