నిజమే. మీడియా దెబ్బకు ఏపీ సీఎం జగన్ దిగిరాక తప్పలేదు. ఎవరూ అడగట్లేదని, సీఎం హోదాలో ఉన్న తమను అడిగేవారెవరన్న కోణంలో తాడేపల్లి మునిసిపాలిటి పరిధిలో రాజప్రసాదం లాంటి భవనాన్ని నిర్మించుకుని దానినే సీఎం క్యాంప్ ఆఫీసుగానూ, వైసీపీ కేంద్ర కార్యాలయంగానూ వినియోగిస్తున్న జగన్… దానికి పన్ను చెల్లించే విషయాన్ని మాత్రం మరిచిపోయారు. జగన్ సతీమణి భారతీరెడ్డి పేరిట ఉన్న సదరు భవనం ప్రైవేటు భవనం కిందకే వస్తున్న నేపథ్యంలో మునిసిపాలిటీ దానికి పన్ను వేసింది. నిర్ణీత కాల వ్యవధిలోగా పన్ను చెల్లించని కారణంగా ఏకంగా జరిమానా కూడా విధించింది. పన్ను, దానిపై జరిమానా విధించిన అధికారులు.. సీఎం జగన్ ఫ్యామిలీ నుంచి ఆ బకాయిలను రాబట్టే సాహసం చేయలేకపోయారు.
మీడియాలో కథనాలతో ఉలికిపాటు
ఈ క్రమంలో మీడియా సంస్థలు ఈ వ్యవహారంపై సంచలన కథనాలు రాశాయి. 16 నెలలుగా పన్ను కట్టకుండా… అసలు మునిసిపాలిటీకి పన్ను చెల్లించాలన్న విషయాన్ని మరిచిన జగన్ ఫ్యామిలీ.. మీడియాలో కథనాలు వచ్చినంతనే ఉలిక్కిపడిందనే చెప్పాలి. వ్యవహారం మరింత ముదిరితే పరువు పోతుందని భావించారో, ఏమో తెలియదు గానీ.. పన్నుతో పాటు దానిపై పడిన జరిమానా.. రెంటినీ కలిపి చెక్కు రూపంలో చెల్లించిన జగన్ ఫ్యామిలీ.. దానికి రశీదును కూడా తీసుకుంది. అయితే అప్పటికే ఈ వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో జగన్ ఫ్యామిలీ పరువు గంగలో కలిసిపోయిందన్న వాదనలు అయితే వైరల్ గా మారిపోయాయి. ఈ వ్యవహారంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్ ఫ్యామిలీ వ్యవహరించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
పన్ను చెల్లించి.. రశీదు తీసుకుని..
జగన్ ఫ్యామిలీ పన్ను ఎగవేతకు సంబంధించి ‘లియో న్యూస్’ గురువారం నాడు ‘‘లేటైంది బాసూ!.. తాడేపల్లి పాలెస్ కు గేట్లు పడాల్సిందే!’’ పేరిట ఓ ప్రత్యేక కథనాన్ని రాసిన సంగతి తెలిసిందే. మునిసిపాలిటీ సర్వర్ల ప్రకారం జగన్ తాడేపల్లి పాలెస్… 16 నెలల నుంచి పన్ను చెల్లించట్లేదు. దీంతో పన్ను బకాయి రూ.13.85 లక్షలుగా తేలింది. దానికి జరిమానాగా రూ.2.82 లక్షలు కలిపితే… మొత్తంగా జగన్ పాలెస్ తాడేపల్లి మునిసిపాలిటీకి రూ.16.67 లక్షలు బాకీ పడింది. దీనిని కట్టాలని అడిగిన నాథుడు లేడు. నోటీసులు జారీ చేసిన దాఖలా కూడా లేదు.అటు మెయిన్ మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు రావడంతో నిజంగానే జగన్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అయినట్టుగానే తెలుస్తోంది. గురువారం కథనాలు రాగానే హడావిడిగా శుక్రవారమే రంగంలోకి దిగిన జగన్ ఫ్యామిలీ పన్నుతో పాటు దానికి జమ అయిన జరిమానా, అపరాధ రుసుములను కలిపి శుక్రవారం నాడు రూ.16.90 లక్షలను భారతీరెడ్డి పేరిట చెక్కుల రూపంలో చెల్లించి రశీదు తీసుకుంది. అంతే మరి… దేవుడికైనా దెబ్బే గురువు అన్నట్లుగా దేనిపై అయినా విమర్శలు వస్తే తప్పించి జగన్ స్పందించేలా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి.