అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం.. అక్కడ ప్రేక్షకులను మెప్పించడం తెలిసిందే. అయితే… జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అండ్ టాప్ ప్రొడ్యూసర్స్ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడే జాన్వీ తెలుగు సినిమాకి ఓకే చెప్పింది, మా సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది’ అంటూ కొంత మంది ప్రకటనలు కూడా చేశారు. ఆమె ఫలానా వారితో నటిస్తోంది అంటూ టాలీవుడ్ టాప్ హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి కానీ.. అవన్నీ వార్తలకే పరిమితం అయ్యాయి.
అయితే…ఇప్పుడు నిజంగానే… జాన్వీ టాలీవుడ్ ఎంట్రీకి అంతా ఫిక్స్ అయ్యిందని.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేయనున్నారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే… పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఆగష్టు 25న లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
అయితే… ఈ సినిమా రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ మరో సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మాటలు జరిగాయని, అంతా ఓకే అయిందని సమాచారం. ఈ సినిమా ద్వారా జాన్వీ తెలుగు తెరకు పరిచయం కావడం ఫిక్స్ అంటున్నారు. మొత్తానికి ఎప్పటి నుంచో అనుకుంటున్న జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. అది కూడా పూరి డైరెక్షన్లో. మరి.. జాన్వీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో.. తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుందో.. లేదో చూడాలి.











