ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. అత్యవసర, కోవిడ్ విధులు మినహా అన్ని సేవలు నిలిపివేసి, నిరసన తెలిపారు.కరోనా విధుల్లో చనిపోయిన డాక్టర్లకు బీమాతోపాటు, ఎక్స్ గ్రేషియా అందించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కోవిడ్ ప్రోత్సాహకాలు అందించాలని, తమిళనాడు ప్రభుత్వం నెలకు రూ.20 వేలు, యూపీలో రోజుకు రూ.1000 ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు వారు గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేలాది మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని, రోగులు చనిపోయినప్పుడు వారి బంధువులు, కుటుంబ సభ్యులు కోపంలో డాక్టర్లపై దాడులకు దిగుతున్నారని, తమకు రక్షణ కల్పించాలని జుడాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే 12వ తేదీ నుంచి అన్ని సేవలు నిలిపివేస్తామని వారు ప్రకటించారు.
ఓపీ సేవలకు ఆటంకం
జుడాల సమ్మెతో ఓపీ సేవలకు ఆటంకం ఏర్పడింది. జుడాలు ప్రస్తుతానికి కరోనా రోగులతో పాటు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిలిన అన్ని సేవలు నిలిపివేయడంతో అవుట్ పేషెంట్ సేవలకు ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో జుడాల సేవలే కీలకంగా ఉన్నాయి. దాదాపు 4 వేల మంది జుడాలు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో జుడాలు అందిస్తున్న సేవలను గుర్తించి వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు.
Must Read ;- కరోనా టీకాలనూ కొనని జగన్ సర్కారు.. ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలన్న పట్టాభి











