ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గినా బ్లాక్ ఫంగస్ ఆందోళన కలిగిస్తోంది.నిన్న లక్ష టెస్టులు నిర్వహించగా12,992 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.92 మంది మరణించారు.గడచిన వారంలోనే రోజు వారీ నమోదవుతున్న కేసుల సంఖ్య 24 వేల నుంచి 13 వేలకు దిగివచ్చాయి.ఇదే విధంగా కొనసాగితే రాబోయే పది రోజుల్లో ఏపీలో కరోనా కేసుల సంఖ్య మూడంకెలకు దిగివస్తాయని అంచనా వేస్తున్నారు.ఏపీలో మూడు వారాలుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సత్ఫలితాలు ఇస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. నెలాఖరు వరకూ కర్ఫ్యూ విధించారు.అంటే మరో వారం రోజులు కర్ఫ్యూ ఉందన్నమాట.అప్పటికి కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.
వేగంగా తగ్గుతోన్న కేసులు
ఏపీలో ఇప్పటికే 15.90 లక్షల మంది కరోనా బారిన పడగా 14 లక్షల మంది కోలుకున్నారు.ఇంకా ఏపీలో లక్షా 90 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే ఏపీలో కరోనా బారిన పడి 10,482 మంది మరణించారు.కరోనా సెకండ్ వేవ్ వేగం తగ్గడంతో వైద్యులపై కొంచెం ఒత్తిడి తగ్గిందనే చెప్పవచ్చు.అయితే ఇంకా ఏపీలో పెద్ద ఎత్తున కరోనా యాక్టివ్ కేసులు ఉండటంతోపాటు,గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ టెస్టులు నిర్వహిస్తే భారీగా కరోనా కేసులు వెలుగు చూసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.గ్రామాల్లో పెద్దగా టెస్టులు చేయకపోవడంతో కరోనా కేసులు తగ్గినట్టు రిపోర్టులు వస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వం ప్రతి రోజూ లక్ష టెస్టులు నిర్వహించామని చెబుతున్నా,అందులో నిజంలేదని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
వణికిస్తున్న బ్లాక్ ఫంగస్..
ఏపీలో 52బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నా,వెయ్యికి పైనే బ్లాక్ ఫంగస్ కేసులు ఉంటాయని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఏపీలో బ్లాక్ ఫంగస్ బారిన పడి ముగ్గురు చనిపోయారు.బ్లాక్ ఫంగస్‌కు సరైన మందులు లభించక,మెరుగైన చికిత్సకు కొందరు రోగులు హైదరబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పయనం అవుతున్నారు.తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏపీ నుంచి వచ్చిన బ్లాక్ ఫంగస్ రోగులను చేర్చుకోవడం లేదు.దీంతో ఏపీలో బ్లాక్ ఫంగస్ సోకిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాజాగా బ్లాక్ ఫంగస్ మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.వీటి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉండటంతో సామాన్యులు వాటిని కొనలేకపోతున్నారు.
ఆక్సిజన్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ఏపీలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంటులు పెట్టేందుకే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే విజయవాడ, గుంటూరు,నెల్లూరు,కర్నూలు జిల్లా ఆసుపత్రుల్లో పనులు ప్రారంభించారు.ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంటులు సిద్దమైతే సమస్యకు చాలా వరకు పరిష్కారం లభించినట్టేనని చెప్పవచ్చు.మరో వైపు సింగపూర్ నుంచి 20 ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పించారు.ఆక్సిజన్ రవాణా,నిల్వకు వీటిని ఉపయోగించుకోవచ్చు.ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆక్సిజన్ సమస్య పరిష్కరించేందుకు అదే పనిలో ఉన్నారు.ఏపీలో దాదాపుగా ఆక్సిజన్ కొరతను అధగమించినట్టే కనిపిస్తోంది.అయితే నిల్వ సామర్ధ్యం పెద్దగా లేకపోవడంతో ఆక్సిజన్ రవాణాలో ఏ మాత్రం ఇబ్బందులు వచ్చినా సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంది.
Must Read ;- నాడు బ్లాక్ ఫంగస్.. నేడు వైట్ ఫంగస్ : భయపడుతున్న మరో కొత్త వైరస్











