అప్పలరాజు చేతిలో మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్న వైనం అందరినీ కంట తడిపెట్టించింది. అయితే ఈ కేసులో అప్పలరాజుకు చాలా మంది సహకరించి ఉంటారన్న వైనంపై ఇప్పటికే పలు కథనాలు వినిపించాయి. అప్పలరాజుతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఈ దారుణంలో పాలుపంచుకున్నారని విజయ్ తరఫు బంధువులు మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ లకు ఫిర్యాదు చేశారు కూడా. అంతేకాకుండా అప్పలరాజుతో పాటు ఈ హత్యోదంతంలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్ట్ చేయడంతో పాటు వారందరిని చంపేయాలని కూడా విజయ్ బంధువులు డిమాండ్ చేశారు.
తాజాగా ఈ ఘటనలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. అప్పలరాజుకు సహకరించిన వారు ఎందరున్నారో తెలియదు గానీ… గ్రామానికి చెందిన హోంగార్డు శ్రీను అనే వ్యక్తి మాత్రం ఈ ఘటనలో ప్రత్యక్షంగానే పాలుపంచుకున్నారన్న అంశం కలకలం రేపుతోంది. హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారంటే పోలీసు శాఖలో పనిచేస్తున్నట్లే కదా. పోలీసు శాఖలో పనిచేస్తున్న వ్యక్తి నేరాలను అరికట్టే దిశగా పనిచేయడానికి బదులుగా హంతకుడికి సహకరించడం, నేరస్తుడికి వత్తాసు పలకడం, ప్రత్యక్షంగా హత్యోదంతాల్లో పాలుపంచుకోవడం అంటే సాధారణ విషయం కాదు కదా. అందుకే అప్పలరాజుకు సహకరించిన వారిలో హోంగార్డు శ్రీను ఉన్నాడన్న విషయం ఇప్పుడు పెను కలకలం రేపుతోంది.
అయినా ఈ విషయం ఎలా వెలులుగులోకి వచ్చిందంటే… హత్యలు జరిగిన చాలా రోజుల తర్వాత వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి జుత్తాడకు వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబంలో మిగిలిన సభ్యులను ఆయన ఓదార్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి… ఈ హత్యోదంతంలో అప్పలరాజుకు హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తి సహకరించారని తెలిపారు. ఈ విషయంపై మరింత మేర ఆధారాలు సేకరించి శ్రీనును హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటుగా అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయినా హత్యలు జరిగి వారం పది రోజులు దాటిపోతున్నా… ఇప్పటిదాకా ఈ కేసుపై పకడ్బందీగా దర్యాప్తు సాగుతున్న దాఖలా ఏమీ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అధికార పార్టీకి చెందిన నేతగా… ఉత్తరాంధ్ర సీఎం హోదాలో ఫోజులు కొడుతున్న సాయిరెడ్డి… హత్య జరిగిన పది రోజుల తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైనం చూస్తుంటే… ఈ కేసులో పెద్దగా దర్యాప్తు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read : జుత్తాడ కేసులో కొత్త కోణం.. హంతకులు ఆరుగురంట











