కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్దాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్ఫాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు, విద్యుత్ బిల్లులే ఆయుధాలుగా వాడనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ రెండు బిల్లులపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురువుతోంది. పంజాబ్ తో సహా ఉత్తారాది రాష్ట్రలలో రైతులు భారి సంఖ్యలో రోడ్డెక్కేరు. దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పావులు కదుపుతున్నారు. తన కేంద్ర ప్రభుత్వంపై తన వ్యతిరేకతను బహిరంగంగా వెల్లడించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులతో ఒక దఫా చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో పాటు పంజాబ్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు.
త్వరలో పంజాబ్, బెంగాల్ లకు ముఖ్యమంత్రి కేసీఆర్
జాతీయ స్ధాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి వ్యవసాయ, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టలన్నది కేసీఆర్ వ్యూహాంగా చెబుతున్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులపై పంజాబ్ కు చెందిన కేంద్ర మంత్రి రాజీనామా కూడా చేసారు. దీంతో ఆ రెండు రాష్ట్రాలలోను రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకుని జాతీయ స్దాయిలో మద్దతు కూడగట్టాలని కల్వకుంట్ల వారి అభిప్రాయం. రానున్న రెండున్నర సంవత్సరాలలో జాతీయ స్దాయిలో అన్ని పార్టీలను కలుపుకుని వచ్చే ఎన్నికలలో ఆరు నెలల ముందు తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దిగాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా చెబుతున్నారు.
జగన్, బాబుల వైఖరి ఏమిటి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ స్ధాయిలో ఏర్పాటు చేయనున్న తృతీయ ఫ్రంట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులు కలుపుతారా అన్నది ప్రశ్నర్ధకరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ స్నేహం ఉన్నా ఏపీ సీఎం జగన్ కు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న పార్టీలతో జగన్ చేతులు కలుపుతారా అన్నది అనుమానమే. రాష్ట్రాలలో స్నేహానికి, జాతీయ స్ధాయిలో సంబంధాలకి ఎలాంటి పొత్తు ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక చంద్రబాబుతో మాత్రం పాత వైరాన్ని కేసీఆర్ ఇంకా మర్చిపోలేదని, ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కలిసే అవకాశం లేదని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలోని పార్టీలతోను కేసీఆర్ చేతులు కలుపుతారని సమాచారం.