తాడిపత్రి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తీవ్రంగా ఆగ్రహించారు. జేసీ ప్రభాకర రెడ్డి ఇంటి మీద దాడికి తెగబడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులను కొట్టారు. వారిని బయటకు లాక్కు వచ్చి.. ఎవడొస్తాడో రండిరా అంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందే తిష్ట వేసి కూర్చున్నారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరని సమాచారం. ఒక్కసారిగా తాడిపత్రి పట్టణ రాజకీయం వేడెక్కింది. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇంతదాకా ఎందుకొచ్చిందంటే..
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు అంటే.. అవి సహజంగా జేసీ బ్రదర్స్ అడ్డాగా అందరూ పరిగణిస్తారు. అలాంటి తాడిపత్రిలో ఈసారి వైఎస్సార్ కాంగ్స్ తరఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా ఇటీవలి కాలంలో కేతిరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వ్యక్తులు తాడిపత్రి ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. ఆ పోస్టులు అన్నీ జేసీ ఇంటి నుంచే వస్తున్నాయని ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసి ఇంట్లో దూరారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కి వెళ్లి తన కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యంగా మెసేజ్ లు చేస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే కెతిరెడ్డి పెద్దారెడ్డి చొక్కపట్టి బయటకు లాక్కొచ్చారు. బయటికి లాక్కొచ్చి కొట్టి.. ఎవడు వస్తాడో రండిరా అంటూ జేసీ ఇంటి వద్దనే కూర్చున్నారు.