వరుస ఫ్లాపులతో సతమతమైపోయిన రవితేజ, ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఆయన అభిమానుల్లో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. దీనంతటికీ కారణం రవితేజ .. గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అస్సలు సమయం వేస్ట్ చేయని వాళ్ల జాబితాలో రవితేజ ఒకరుగా కనిపిస్తాడు. కథ వినడం .. ఆలోచించి చెబుతానని అనడం .. ఆ విషయాన్ని అలాగే నాన్చుతూ వెళ్లడం రవితేజకి అలవాటు లేని పని. ఆయన కథ వినేసి ఓకే చెప్పాడంటే, ఇక సెట్స్ పైకి సర్దుకోవలసిందే.
అలా వరుస సినిమాలతో తన దూకుడు చూపుతూ వచ్చిన రవితేజకి, అవతలివారి ప్లానింగ్ లోపం కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ఆ తరువాత అదృష్టం బాగోలేక కొన్ని ఫ్లాపులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రవితేజతో ‘డాన్ శీను’ .. ‘బలుపు’ సినిమాలను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను నమోదు చేశాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరూ ‘క్రాక్’ ప్రాజెక్టును పట్టాలెక్కించి, ‘సంక్రాంతి బరిలోకి సినిమాను దింపారు. విడుదలకి ముందే ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు.
సంక్రాంతి కానుకగా థియేటర్లకు వచ్చిన ‘క్రాక్’ .. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. రవితేజ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండటంతో, మాస్ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెరపై రవితేజ చేసిన రచ్చ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లను సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రమోషన్స్ సమయంలో రవితేజ – గోపీచంద్ మలినేని చెప్పినట్టుగానే హ్యాట్రిక్ హిట్ కొట్టేశారన్న మాట.
Must Read ;- ‘క్రాక్’ పోలీసు బాక్సాఫీసు దుమ్ము దులిపేస్తున్నాడు











