ఈ సంక్రాంతికి మాస్ మహారాజు రవితేజ శుభారంభం కొట్టేశాడు. బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బరిలో ఉన్న సంక్రాంతి పందెం కోళ్లకు వెన్నులో వణుకు పుట్టించే విజయమిది. రేటింగ్ ల విషయంలో ఐఎండీబీ కూడా ఎప్పుడూ లేనివిధంగా 9.2 పాయింట్లు ఇచ్చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీ కూడా పట్టం కట్టేసిందంటే ఫలితం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య హిట్ల విషయంలో రవితేజ కాస్త వెనుకబడ్డారు. ఇంతకుముందు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ డాన్ శీను, బలుపు చిత్రాలు చేశారు.
ఆ రెండింటి కన్నా ఇది పెద్ద హిట్ అనే చెప్పాలి. నిన్న సినిమా విడుదల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నా ఎట్టకేలకు సాయంత్రం సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమా ఫలితం చూశాక నిర్మాత ఠాగూర్ మధు కూడా ఊపిరిపీల్చుకున్నారు. రవితేజ మాస్ అప్పీలుకు తగ్గట్టుగా మలినేని జాగ్రత్తలు పడటంవల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పొచ్చు. దీనికి బుర్రా సాయి మాధవ్ డైలాగులు కూడా తోడయ్యాయి. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ ఫైట్ సీక్వెన్స్ లు ఈ సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి.
ఈ నెల 13న తమిళ డబ్బింగ్ మాస్టర్, 14న రామ్ రెడ్, అల్లుడు అదుర్స్ రానున్నాయి. మిగతా మూడు సినిమాలు కూడా పూర్తిగా పక్కా మాస్ కథాంశాలే. ఒక విధంగా చెప్పాలంటే రవితేజ ముందుగానే ప్రేక్షకులు ముందుకు రావడం మంచి ప్రయత్నం. సినిమా మీద ఓ స్పష్టత వచ్చేసింది. రేపటి నుంచి షోల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కథలో కొత్తదనం లేకపోయినా కథనంలో దర్శకుడు ప్రతిభ చూపడం, రవితేజ తనదైన మాస్ అప్పీలుతో దుమ్మురేపేయడంతో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. మరో సినిమా వచ్చే లోపే ‘క్రాక్’ దూకుడు పెరిగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
Must Read ;- ‘క్రాక్’ వీరశంకర్ వీరబాదుడు (రివ్యూ)