ఏపీలో ప్రయివేటు కాలేజీల మూసివేత విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటర్మీడియట్ విద్యతోపాటు సమాంతరంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశ విద్యకు ఏపీలోని ప్రయివేటు కాలేజీలకు మంచి పేరుంది. దేశంలోని మొత్తం ఐఐటీ సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 32 శాతం సీట్లు సాధిస్తున్నారంటే దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన ప్రయివేటు విద్యారంగమేనని చెప్పాలి. కోవిడ్ దెబ్బకు ప్రయివేటు కళాశాలలు కుదేలవగా , ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇక కాలేజీలు నడపలేమని యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఏపీలో నిబంధనల పేరుతో ఒకేసారి 600 కాలేజీలు మూసివేయడంతో పదో తరగతి పాసయిన విద్యార్ధులు ఇంటర్మీడియట్లో ఏ కాలేజీలో చేరాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీకి కోచింగ్ ఇచ్చే పేరున్న విద్యాసంస్థల అనుమతులు ఏపీ ప్రభుత్వం రద్దు చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు
ఏపీలో ప్రభుత్వ కాలేజీలు ఏనాడో ప్రాభవాన్ని కోల్పోయాయి. మూడు దశాబ్దాల కిందటి వరకు ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ కళాశాలలు మూసివేత దిశగా సాగుతున్నాయి. ఏపీలో ఉన్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల్లో 4000 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా, నేడు కేవలం 700 మందితో నెట్టుకొస్తున్నారు. ఏ మాత్రం చదివించే ఆర్థిక స్థోమత ఉన్నా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్ధులను చేర్పించడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు లేకపోవడం ఒక కారణమైతే, ఆ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీల్లో ప్రవేశాలకు శిక్షణ ఉండదు. అదే ప్రయివేటు కళాశాలల్లో అయితే ఇంటర్మీడియడ్ రెండు సంవత్సరాల విద్యతోపాటు ఐఐటీ కోచింగ్ అందిస్తున్నారు. ఇవన్నీ విద్యార్ధులకు కలసి వస్తున్నాయి. అందుకే ప్రభుత్వ కాలేజీలు పడకేశాయి. ప్రభుత్వ కళాశాల్లో ఏమాత్రం సౌకర్యాలు మెరుగు పరచకుండా ఏక మొత్తంగా ఏపీలో 600 ప్రయివేటు కళాశాల అనుమతులు రద్దు చేయడం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తెలంగాణకు క్యూ కట్టిన ప్రయివేటు కాలేజీలు
గత ఏడాది వరకూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్మీడియట్ చదివించేందుకు విజయవాడలోని పేరున్న కాలేజీల్లో చేర్పించేవారు. నేడు పరిస్థితి తారుమారైంది. విజయవాడలో పేరున్న ఐఐటీ కళాశాలలకు ప్రభుత్వం తాళాలు వేయడంతో, ఇక తమ పిల్లలను హైదరాబాద్‌లోని ప్రయివేటు విద్యాసంస్థల్లో చేర్పించేందుకు తరలివెళ్లిపోతున్నారు. దీంతో ఏపీలో ప్రయివేటు కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న దాదాపు లక్షా 20 వేల మంది సిబ్బంది కూడా కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ హైదరాబాద్ పయనమవుతున్నారు. ఇలా ఏపీలో 600 కాలేజీల అనుమతుల రద్దుతో విద్యారంగం భారీ కుదుపునకు గురైందనే చెప్పాలి.
ప్రభుత్వం ఏం చెబుతోంది
ఈ ఏడాది 6.32 లక్షల మంది పదో తరగతి పాసయ్యారు. వీరికోసం ఏపీలో 5.85 లక్షల ఇంటర్మీడియట్ సీట్లు సిద్దంగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్లో ప్రవేశాలను ఆన్‌లైన్ చేశారు. 12 రోజుల నుంచి అడ్మిషన్లు జరుగుతున్నా నేటికీ లక్షన్నర మంది మాత్రమే కాలేజీలను సెలక్ట్ చేసుకున్నారు. అంతే దాదాపు 4 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు హైదరాబాద్‌కు వలస వెళ్లారని తెలుస్తోంది.
అనుమతులు ఎందుకు రద్దు చేశారంటే
ఏపీలో 600 కాలేజీలకు అనుమతులు ఎందుకు రద్దు చేశారనే విషయాలను లియో న్యూస్ పరిశీలించింది. చాలా కాలేజీలు నగరం మధ్యలో నడుస్తున్నాయి. అలాంటి కాలేజీల్లో ఆట స్థలం ఆశించలేం. కానీ విద్యాప్రమాణాల విషయంలో మంచి పేరున్న కాలేజీలను ఆట స్థలం లేదని రద్దు చేశారు. ఇక చాలా కాలేజీలు ఫైర్ సేప్టీ లేదని అనుమతులు రద్దు చేశారు. కాలేజీలు, పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. ఇక ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతిస్తున్నామని, అయితే కొన్ని ప్రయివేటు కాలేజీలు ఒక్కో సెక్షన్లో 80 మందిని చేర్చుకుంటున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా బాగుంది. విద్యామండలి నిబంధనల ప్రకారం తరగతికి 40 మంది మించడానికి వీల్లేదు. ఇలాంటి కారణాలతో ఒకేసారి 600 కాలేజీల అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం, విద్యార్ధులకు ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం విఫలమైందని చెప్పవచ్చు.
ఒక వైపు ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకులే లేనప్పుడు, ప్రయివేటు కాలేజీలు నిబంధనలు పాటించడం లేదని అనుమతులు రద్దు చేయడం దారుణం. ఈ నిబంధనలు ప్రభుత్వ కాలేజీలకు కూడా వర్తింపచేస్తే చాలా కాలేజీలు మూసివేయాల్సి వస్తుందని ప్రయివేటు కళాశాల యాజమాన్యాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమే కదా ప్రయివేటు కాలేజీకి ఒక రూలు, ప్రభుత్వ కళాశాలకు మరో నిబంధన ఉండదు కదా మంత్రి గారు.