బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చంచల్ గూడ జైల్లో ఉన్నారు. కాగా ఆమె తమ్ముడు, భూమా నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని కూడా పోలీసులు అనుమానితుల జాబితాలో చేర్చారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉందని పోలీసులు అంటున్నారు.
మంగళవారం నాటి పరిణామాలను పరిశీలిస్తే..
భూమా అఖిలప్రియను మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో.. మంగళవారం నాడు అఖిలప్రియ రెండో రోజు విచారణ కొనసాగింది. కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తులు, గుంటూరు శ్రీను తదితరులు కిడ్నాప్ కు ముందు అఖిలప్రియతో మాట్లాడిన సంగతులను ఫోను నెంబర్లు కాల్ డేటా ఆధారంగా, పోలీసులు ప్రశ్నించినప్పుడు.. నాయకురాలిగా తనతో ప్రతిరోజూ ఎంతో మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటారని, వారు తనకు తెలియదని అఖిలప్రియ చెప్పినట్టు సమాచారం. కొత్తగా తీసుకున్న ఫోను నెంబర్ల వివరాలను కూడా ఆమె ముందుంచి పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు తనకేమీ తెలియదని అఖిలప్రియ చెబుతున్నట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. చివరికి ప్రస్తుతం పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ గురించి అడిగినప్పుడు కూడా.. ఎక్కడున్నాడో తనకు తెలియదన్నట్టుగా వివరాలు అందుతున్నాయి.
అదే సమయంలో- రెండో వైపున.. కిడ్నాప్ కు పాల్పడిన కొందరు నిందితులను పోలీసులు గోవాలో పట్టుకున్నారు. మొత్తం నలుగురిని అక్కడ అదుపులోకి బోయిన్ పల్లి పోలీసులు తీసుకున్నారు. వీరిలో సిద్ధార్ద్‌తో పాటు మరో ముగ్గురున్నారు. వీరిని పోలీసులు హైదరాబాద్ తీసుకురానున్నారు.
భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనివాస్ తో పాటు మరి కొంత మంది కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది.
కొత్త కోణం ఏంటంటే.. కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి ప్రమేయం వున్నట్లు పోలీసులు గుర్తించారు. జగత్ విఖ్యాత రెడ్డి కారు డ్రైవర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసారు. బుధవారం జరగనున్న అఖిల ప్రియ 3వ రోజు విచారణ.. చాలా కీలకం అవుతుందని పలువురు భావిస్తున్నారు.
Must Read ;- అక్కలాగే కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆళ్లగడ్డలో మౌనికారెడ్డి సమావేశం