ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడం, పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న బీజేపీని విపక్షంలోకి నెట్టేసేందుకు విపక్షాలన్నీ కూడబలుక్కుంటున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో మోదీని, కాషాయ దళాన్ని తనదైన శైలిలో నిలువరించి.. వరుసగా మూడో పర్యాయం ఆ రాష్ట్రానికి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇప్పుడు హస్తిన పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఢిల్లీలో ల్యాండైన దీదీ.. తొలుత తన రాజకీయ ప్రత్యర్థి మోదీ వద్దకే వెళ్లారు. పలు సాధారణ అంశాలతో వీరి భేటీ ముగిసినా.. ఆ భేటీ తర్వాత తన హస్తిన పర్యటన ఎలా సాగుతుందన్న విషయాన్ని వెల్లడించిన దీదీ.. దేశ ప్రజలకు ఒక్కసారిగా జాతీయ రాజకీయ పరిణామాలపై ఆసక్తి రేకెత్తించారు.
సోనియాతో పాటు రాహుల్ కూడా..
తన ఢిల్లీ పర్యటనలో రెండో రోజైన బుధవారం దీదీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. 10 జన్‌పథ్ లో సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ ఆద్యంతం చాయ్ పే చర్చా మాదిరిగానే జరిగింది. సోనియాతో పాటు యువ నేత రాహుల్ గాంధీ కూడా ఈ భేటీలో పాలుపంచుకున్నారు. దీదీ చెప్పిన అంశాలన్నింటినీ సావధానంగా విన్న కాంగ్రెస్ నేతలు.. మోదీని గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని ఒప్పుకున్నారు. ఈ దిశగా దీదీనే కాస్తంత చొర తీసుకోవాలని కూడా వారు కోరినట్టు సమాచారం. ఇకపై కలిసికట్టుగా పోరాడాలని, 2024 ఎన్నికల్లో మోదీ-బీజేపీని ఓడించే లక్ష్యంతోనే పని చేద్దామని వారు నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ భేటీతో మోదీని వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్నింటికీ ఓ భరోసా అయితే వచ్చిందనే చెప్పాలి.
మోదీపైకి దీదీనే..
ఇదిలా ఉంటే.. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం ఒక ఎత్తైతే.. అవన్నీ విడిపోకుండా ఉమ్మడిగా సుధీర్ఘకాలం పాటు కలిసికట్టుగా పోరు సాగించేలా వ్యూహాలు రచించడం, అన్ని పార్టీలను ఏకతాటిపై నడిపే నేత అవసరం మరో ఎత్తే. అయితే దీదీతో భేటీలో.. ఈ బాధ్యతలను ఆమెనే తీసుకోవాల్సిందిగా సోనియా ప్రతిపాదించడం చూస్తుంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఢీకొట్టేందుకు నేరుగా రంగంలోకి దిగే నేత దీదీనే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే మాటను భేటీ తర్వాత మీడియా అడిగితే.. ఆ మాటను ఖండించని దీదీ.. తానేమీ జ్యోతిష్యురాలిని కాదంటూ చమత్కరించి వెళ్లడం కూడా ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. 2014లో మోదీ నినదించిన చాయ్ పే చర్చా ఏ మేర హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో పదేళ్ల తర్వాత 2024లోనూ అదే నినాదం ప్రధానాస్త్రంగా మారనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నాడు మోదీకి ఈ నినాదం అస్త్రంగా మారితే.. ఇప్పుడు విపక్షాలు దీనిని ఏ రీతిన వాడతాయన్నదానిపైనే వాటి విజయం ఆధారపడి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ‘మీడియాను కంట్రోల్ చేస్తున్న మోదీ!’