తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియని హుజూరాబాద్ ఉప ఎన్నిక వైపే చూస్తోంది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బహిష్కరిస్తే.. ఈటల ఏకంగా టీఆర్ఎస్ కు, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోయారు. నాటి నుంచి హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైనట్లే కదా. అందుకే.. ఇంకా నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని హుజూరాబాద్ బైపోల్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. అయితే హుజూరాబాద్ బైపోల్ కంటే ముందు తెలంగాణలో మరో కీలక ఎన్నికలు జరగనున్నాయి. అవే శాసనమండలిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం జరిగే ఎన్నికలు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలితల పదవీ కాలం గత నెల 3తోనే ముగిసింది. ఆలోగానే ఎన్నికలు నిర్వహించి వాటిని భర్తీ చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాటి జోలికి వెళ్లలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణపై ఈసీ.. తెలంగాణ ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది.
కేసీఆర్ ఓకే అంటే.. తక్షణమే ఎన్నికలు
పదవీ కాలం ముగిసిన ఆరుగురు ఎమ్మెల్సీల కారణంగా జూన్ 3 నుంచి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు క్రమంగా తగ్గుతుండటం, రాష్ట్రంలో అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయమై ఈసీ ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం తెలపాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం. ఇక ఈసీ లేఖపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు కేసీఆర్ సర్కారు ఓకే అంటే.. తెలంగాణలో త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలు పోటీ చేస్తాయా?
అటు హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కూడా ఈటల రాజీనామా చేసిన ఆరు నెలల్లోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే.. ఇప్పటికిప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకపోయినా.. మరో రెండు నెలల్లోగా తప్పనిసరిగా నోటిఫికేషన్ రావాల్సిందే. ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. ఎలాగూ సభలో బలం టీఆర్ఎస్ దే కదా. ఆరుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకునేది కూడా ఎమ్మెల్యేలే కదా. ఎలాగూ సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేని కారణంగా బీజేపీ అసలు బరిలో దిగే ఛాన్సే కనిపించడం లేదు. ఇక కనీసం ఒక్క స్థానాన్ని అయినా నెగ్గాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నా.. ఆ ఒక్క స్థానాన్ని గెలిపించుకునే బలం ఆ పార్టీకి కూడా లేదనే చెప్పాలి. అయినా దూకుడుగా వెళ్లే స్వభావం ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిని తప్పనిసరిగా నిలబెడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగి.. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ అనివార్యంగా మారితే.. ఆ పోటీ టీఆర్ఎస్ బలంగా మారడం, కాంగ్రెస్ తో పాటు బీజేపీకి బలహీనంగా మారడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- పాడి, స్వర్గం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?











