తమిళనాట ఇప్పుడు అందరూ విజయ్ సినిమా ‘మాస్టర్’ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ గురించే ముచ్చటించుకుంటున్నారు. ‘దీపావళి’ కానుకగా నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. ఒక వైపున కాలేజ్ స్టూడెంట్స్ .. మరోవైపున విలన్ గ్యాంగ్ నేపథ్యంలో సాగే సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్లో కనిపించిన కాసేపు విజయ్ తనదైన స్టైల్ తో మెరిశాడు. ఈ టీజర్ ను వదిలీ వదలగానే ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. కొన్ని గంటల్లోనే ఈ టీజర్ 15 మిలియన్ వ్యూస్ ను రాబట్టి దక్షిణాదిలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ సమయంలోనే ఈ టీజర్ కి 1.6 మిలియన్ లైక్స్ లభించడం మరో విశేషం.
అంచనాలకి మించి అన్నట్టుగా ఈ టీజర్ దూసుకుపోతుండటం పట్ల విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో వచ్చే ఏడాదిలో విజయ్ కి భారీ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తమిళనాట విజయ్ సేతుపతికి గల క్రేజ్ కూడా తక్కువేం కాదు. విలక్షణ నటుడిగా అక్కడ ఆయనకి బ్రహ్మరథం పడుతుంటారు. ‘మాస్టర్’ లో ఆయన విలన్ రోల్ చేయడం, ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కేవలం మూడంటే మూడే సినిమాలతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన ప్రతిభను చాటుకున్నాడు. నాలుగో సినిమానే విజయ్ తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు అంటే, ఆయన సత్తా ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆయన చేసిన కార్తీ ‘ఖైదీ’ చూసిన వాళ్లంతా ‘మాస్టర్‘ను ఒక రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, విజయ్ సరసన నాయికగా మాళవిక మోహనన్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
AlsoRead ;- దీపావళికి రానున్న విజయ్ ‘మాస్టర్’ తెలుగు టీజర్
AlsoRead ;- ‘క్విట్ పన్నుడా..’ అంటూ పాటేసుకున్న ‘మాస్టర్’