తమిళ దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ కథానాయికగా నటించింది. జావియర్ బిట్టో నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ లెక్చరర్ గా నటిస్తున్నాడు. కొరియన్ మూవీ ‘సైలెన్స్డ్’ మూవీకిది ఫ్రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. కథ ప్రకారం ఇందులో విజయ్.. మూగ, బధిరుల స్కూల్లో పాఠాలు చెబుతాడని తెలుస్తోంది.
అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని ‘కుట్టి స్టోరీ’ అనే లిరికల్ సాంగ్ ను విజయ్ స్వయంగా ఆలపించగా.. ఆ పాటను వేలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అంటే లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. విఘ్నేష్ శివన్ రచించిన ‘క్విట్ పన్నుడా’ అంటూ సాగే ఈ పాటను అనిరుధ్ బృందం ఆలపించారు. ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తమిళంతో పాటు తెలుగు లో కూడా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.