కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలో అడుగుపెడుతూనే హిట్ కొట్టేస్తారు. తొలి సినిమాతోనే ఇటు థియేటర్లపై .. అటు కుర్రాళ్ల కలల వనంపై అందాల దాడి చేస్తారు. మరికొంతమంది హీరోయిన్లు కాస్త ఆలస్యమైనా, ఆ వెంటనే వరుస సక్సెస్ లతో సందడి చేస్తారు. ఇక మిగిలినవారు మాత్రం సరైన హిట్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి హిట్టు ఏ సినిమాతో పలకరిస్తుందా అన్నట్టుగా వేయికళ్లతో వెయిట్ చేస్తుంటారు. అలాంటి కథానాయికలలో ‘మేఘ ఆకాశ్‘ ఒకరుగా కనిపిస్తుంది.
అందం పరంగా చూసుకుంటే మేఘ ఆకాశ్ చందమామలాంటి పిల్ల. అభినయం పరంగా చూసుకున్నా లోపాలేం కనిపించవు. కుదురుగా .. కుందనపు బొమ్మలా ఉండే మేఘ, చక్కని పలువరుసతో .. ఆకర్షణీయమైన నవ్వుతో ఆకట్టుకుంటుంది. కాకపోతే ఈ అమ్మాయి ఎంట్రీ ఇచ్చిన వేళా విశేషం బాగోలేదేమో తొలి రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ‘లై’ .. ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలు నిరాశపరచడంతో, సహజంగానే ఊహించిన స్థాయిలో ఊతం లభించలేదు .. ఊపందుకోలేదు. దాంతో ఈ అమ్మాయి వరుసగా తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.
కొంత గ్యాప్ తీసుకున్న ఈ అమ్మాయి మళ్లీ తెలుగులో ‘మనుచరిత్ర’ .. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలు చేసింది. ఆ సినిమాలు విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ‘డియర్ మేఘ’ .. ‘రాజ రాజ చోర’ సినిమాలు చేసింది. అయితే ‘డియర్ మేఘ’ సినిమా ఈ అమ్మాయి పేరుతోనే జనంలోకి వెళుతుండటం విశేషం. ఇది ప్రేమకథ కావడం .. తాజాగా వదిలిన లిరికల్ వీడియో కూడా మంచి ఫీల్ తో ఉండటం వలన అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అయినా ఆమె ఆశించే విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Must Read ;- దగ్గుబాటి అభిరామ్ సరసన మహేష్ హీరోయిన్ సిస్టర్?











