సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాకి సంబంధించి, రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. దాంతో అంతకంతకూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో కొత్త విషయం బయటికి వచ్చింది .. మరో యంగ్ హీరోయిన్ కి ఈ సినిమాలో ఛాన్స్ లభించిందనేదే ఆ వార్త సారాంశం. ఆ హీరోయిన్ ఎవరోకాదు .. మేఘ ఆకాశ్. ఈ సినిమాలో రష్మికతో పాటు ఈ అమ్మాయి కూడా ఓ హీరోయిన్ అనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో ఈ అమ్మాయి, బన్నీకి చెల్లెలిగా కనిపించనుందనేది అసలు విషయం.
కరోనా తలనొప్పి కారణంగా ‘పుష్ప’ షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అందువల్లనే ఇకపై మరింత ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా షూటింగును చకచకా కానిచ్చేస్తున్నారు. అలాంటి ఈ సినిమా కోసమే మేఘ ఆకాశ్ ను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. బన్నీ చెల్లెలి పాత్రలో ఈ బ్యూటీ కనిపించనుందని అంటున్నారు. కథ ఈ పాత్ర కారణంగానే అనూహ్యమైన మలుపు తిరుగుతుందని చెబుతున్నారు. తన చెల్లెలి కోసమే బన్నీ స్మగ్లర్ గా మారతాడని అంటున్నారు. అంటే కథలో సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉంటుందన్న మాట.
‘లై’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మేఘ ఆకాశ్, ఆ తరువాత ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా కూడా చేసింది. కానీ ఆ సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఆ ప్రభావం ఆమె కెరియర్ పై పడింది. అలా యంగ్ హీరోయిన్ల రేసులో వెనకబడిపోయిన ఈ అమ్మాయి, అప్పటి నుంచి ఇక్కడ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఈ అమ్మాయికి ‘పుష్ప’లో మంచి రోల్ తగిలింది. ఈ సినిమా ఈ అమ్మాయి కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Must Read ;- మళ్లీ అడవులకు వెళ్లనున్న పుష్ప టీమ్











