ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎండగడతామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్‌లో మీడియాతో తెలిపారు. భైంసా అల్లర్లు, నిరుద్యోగభృతి, పీఆర్సీ తదితర అంశాలను లేవనెత్తుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులన్నీ.. నోట్ చేసి పెట్టామని, ప్రతి తప్పునీ సభలో ఎండగడతామని అన్నారు. ప్రజలు, సభ్యుల హక్కుల కోసం సభలో కొట్లాడతామని తెలిపారు.
భైంసా అల్లర్లకు బీజేపీకి సంబంధమేంటి?
తెలంగాణ ప్రభుత్వం కావాలనే బీజేపీపై అనవసరపు ఆరోపణలు చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. భైంసా అల్లర్లకు బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు. నిజంగా ఆ అల్లర్లతో సంబంధమే ఉంటే.. బీజేపీపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. డీజీపీ అనుమతిస్తే.. భైంసాకు వెళ్లి బాధితులను పరామర్శిస్తామని తెలిపారు.
హరీశ్ సిద్దిపేటకే మంత్రా?
హరీశ్ రావు యావత్తు తెలంగాణకు ఆర్థికమంత్రా? లేక ఒక్క సిద్దిపేటకే ఆర్థిక మంత్రా?.. అని రఘునందన్ రావు ప్రశ్నించారు. సభలో ఇదే విషయాన్ని అడుగుతానని తెలిపారు. గాంధేయ మార్గంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని, అదే విధానాన్ని అసెంబ్లీలో కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని సరైన పద్ధతిలో నడిపించేందుకు బీజేపీ సలహాలు, సూచనలు ఇస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఫలితాలే.. పట్టభద్రుల ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Must Read ;- హామీలు, విమర్శలు.. ‘ఆఫ్ ది రికార్డు’ ప్రచారానికి అస్త్రాలు సిద్ధం