జూనియర్ ఎన్టీఆర్ రామారావ్ గా మారిపోయారు. జెమినీ టీవీ కోసం చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో చివరిలో ఎందరో మహానుభావులు.. సైనింగ్ ఆఫ్ మీ రామారావ్ అంటూ ముగించడంతో ఆయన సంబోధించేవారు కూడా రామారావ్ అంటూ పిలవడం మొదలెట్టారు.
ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోమోకు ఎన్టీఆర్ ధరించిన సూట్ ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. ఈ ఫొటోను డబ్బో రత్నాని క్లిక్ మనిపిస్తే ఎలా ఉంటుందో కూడా మీరు ఈ కింద చూడొచ్చు. ఎన్టీఆర్ మీడియా ముందుకు వస్తున్నానుకుంటే అంటే ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో ఆయన ఊహించకుండా ఎలా ఉంటారు. అందుకే ఎక్కడా తడుముకోకుండా సమాధానం చెప్పారు. ఎంతో జోవియల్ గా నవ్వుతూ మీడియా మిత్రుల్ని పలకరించారు. అభిమానుల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని కూడా నందమూరి తారక రామారావు అన్నారు. ఈ మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ షో ఒప్పుకోవడానికి కారణమేమిటి?
ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడమే ఈ షో ప్రధాన లక్ష్యం. గతంలో కూడా ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించి ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. కాబట్టి నాకు ఇది ఓ ఛాలెంజ్ అనుకోవాలి. నా వంతు మార్క్ క్రియేట్ చేయడానికి నేను కూడా కృషి చేస్తా.
దాదాపు మూడేళ్లుగా మీరు సినిమాల్లో కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండటం లేదు. అభిమానులు మీకు పంపించే మెసేజ్ లు చూస్తారా?
మొదటి నుంచి నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. నా అభిమానులు నా నుంచి ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రతిసారీ నా టీమ్ నుంచి నాకు సమాచారం ఉంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంతలా డిమాండ్ చేయడం వల్లే మూడేళ్ల నుంచి కనిపించడం లేదు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు నేను గర్విస్తున్నా. మన హీరోలకు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చే చిత్రం ఇది. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఖాళీ సమయాన్ని వారితో గడుపుతున్నా. అంతకుమించి నేను మాత్రం ఏం కోరుకుంటాను.
మీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు?
ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నఅడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో కూడా మీకు బాగా తెలుసు. మీరే చెప్పండి దీనికి సమాధానం ఏమిటో. దాని గురించి మాట్లాడటానికి ఇది సమయమూ కాదు.. సందర్భమూ కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు కాఫీ తాగుతూ మనం సరదాగా కబుర్లు చెప్పుకుందాం.
ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్.. రామారావుగా ప్రమోట్ అయ్యారనుకోవచ్చా?
జూనియర్ ఎన్టీఆర్, తారక్, రామారావు.. ఇలా ప్రేమతో ఎలా పిలిచినా నేను పలుకుతా. నన్ను ఇలాగే పిలవండి అని నేనెప్పుడూ పట్టుబట్టి అడగలేదు. నేను నా అభిమానులకు చేసిన దానికంటే నా అభిమానులు నాకు చేసిందే ఎక్కువ. మీరు ఇలా చేస్తే బాగుంటుందని నేను ఏ రోజూ వాళ్లతో చెప్పలేదు. వాళ్లే అనుకుని ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు.. చేస్తున్నారు. ఏ హీరో అభిమాని అనేది ముఖ్యం కాదు.. మనుషులుగా సేవ చేస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది. అభిమానుల రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. రుణం అనేది తీరని బంధం. అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగే స్థాయిలో నేను పనిచేస్తా. వారి నమ్మకాన్ని వమ్ము చేయను.
ఈ షో ఎలా ఉండబోతోంది?
షో ఫార్మాట్ ఏమీ మారలేదు. డబ్బులు ఇవ్వడానికే జెమినీ వారు ఈ షో చేస్తున్నారు. ఈ షో నుంచి డబ్బులు ఎంత తీసుకువెళ్లామన్నది ముఖ్యం కాదు. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఆత్మవిశ్వాసంతో వెళ్లేలా చేయడమే నా బాధ్యత.
Must Read ;- ఆట నాది.. కోటి మీది అంటున్న ఎన్టీఆర్