రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరాలంటే.. కేవలం రాజకీయ వ్యూహమే సరిపోదు. సమయస్ఫూర్తి, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు.. ఒక్క మాటతో ప్రజలను తమవైపు తిప్పుకోగలగాలి. ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా..రాజ్యాధికారమే. ఆ రాజ్యాధికారం చేజిక్కాలంటే..కొన్ని భరించాలి. భరించే స్థానంలో ఉన్నవారికే సదరు రాజ్యాధికారం దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ఇది కేసీఆర్‌కి సాధ్యమైందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కొన్ని విజయాలు, పరాజయాలు, ఆరోపణలు, విమర్శలు, అవమానాలు, చీత్కారాలు.. సన్మానాలు అందుకోవాల్సి ఉంటుంది. 2001లో పార్టీ స్థాపించినప్పుడు ఎలాంటి వ్యూహం ఉందో.. 2021లోనూ అదే వ్యూహం కనిపిస్తోంది. ఈ వ్యూహాలు గతంలో కొన్నిసార్లు విఫలమైనా.. ఇప్పుడు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయ నిర్ణయాలపై ప్రత్యేక కథనం..
యూత్ కాంగ్రెస్ లీడర్‌గా..
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కేసీఆర్..రాజకీయ జీవితం యూత్ కాంగ్రెస్ లీడర్‌గా మొదలైంది. 1983లో టీడీపీ ఏర్పాటుతో ఆయన ఆ పార్టీలో చేరారు. పార్టీ విధానాలు నచ్చడం ఒక కారణం కాగా కేసీఆర్‌కి ఎన్టీఆర్ అభిమాన నటుడు. ఆ అభిమానంతోనే తన కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ అంటే అభిమానంతోనే ఆయన టీడీపీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. చంద్రబాబు హయాంతో మంత్రిగా చేశారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ సాధనే ధ్యేమయని చెబుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టారు. అప్పటికే తెలంగాణ నినాదం ప్రజల్లో ఉండడంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. మలివిడత తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ కూడా ప్రధాన భూమిక పోషించింది. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కొత్త రూపం దాల్చింది.
2004లో కాంగ్రెస్‌తో పొత్తు..
2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచింది. 54స్థానాల్లో పోటీ చేయగా 26చోట్ల గెలిచింది. తరువాత తెలంగాణ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని కారణంగా చెబుతూ.. పార్టీ సభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. 16 స్థానాల్లో పోటీ చేయగా 7 గెలిచారు. ఇలా మొదలైన పార్టీ విజయ,పరాజయాలను దాటి.. 2014లో రాష్ట్రాధికారాన్ని సాధించింది. 2019లోనూ గెలుపొందింది.
Must Read ;- ‘మరో పదేళ్లు నేనే సీఎం’.. అందరికీ షాకిచ్చిన కేసీఆర్

పోరాటాలతో..
2001లో పార్టీ ఏర్పాటైనా..ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ వైపు పొత్తులు నడిపిస్తూనే..పార్టీ విస్తరణ కూడా చేపట్టాల్సి వచ్చింది. 2004లో వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కూటమిలో చేరగా 2009లో టీడీపీతో పొత్తుపెట్టుకున్నారు. వీరిద్దరూ సీమాంధ్రవాసులని ఓ వైపు విమర్శిస్తూనే..పొత్తు పెట్టుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చినా.. అధికారం ఉంటేనే పోరాటం సాధ్యమని, అధికారం కోసం, ధిల్లీ స్థాయిలో ఒత్తిడి చేయాలంటే..పొత్తు తప్పదని, అయితే పార్టీ లక్ష్యం ఏనాడూ విస్మరించబోమని అప్పట్లోనే కరీంనగర్ సభలో వ్యాఖ్యానించారు. కేవలం పోరాటంతోనే రాష్ట్రం సాధ్యం కాదని, రాజకీయ పోరాటం కూడా అవసరమని చెప్పే కేసీఆర్ అదే విధానం అనుసరించారు. అందుకే ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలామందితో పొత్తు పెట్టుకున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ లాంటివి ఏర్పాటు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్ లాంటివాళ్ల ఆశీర్వాదం (తరువాత వారిని అవమానించారనే విమర్శలున్నాయి) గాదె ఇన్నారెడ్డి, కోదండరాం, దిలిప్ కుమార్ ఇలా ఎంతో మంది సహకారం తీసుకున్నారు. తరువాత వారిని విస్మరించారన్న ఆరోపణలున్నా..కేసీఆర్ పట్టించుకోలేదు.
పదవులకు రాజీనామా..
కేసీఆర్ తనపై రాజకీయంగా విమర్శలు పెరిగిన తరుణంలో ఒకే ఒక్క అస్త్రాన్ని సంధింస్తారని విశ్లేషకులు చెబుతుంటారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కూడిన రాజీనామానే ఆ అస్త్రం అని చెబుతారు. 2008 నుంచి మొదలైన ఈ రాజీనామాలు.. 2018 ముందస్తు ఎన్నికల వరకు అదే సెంటిమెంట్‌తో నడిచాయి. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు రాజీనామాల్లో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ సాధన లక్ష్యంగా చెప్పి..పలు మార్లు రాజీనామాలు చేయగా 2018లో ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో వారికి సమాధానం చెప్పేలా తీర్పు ఇవ్వాలని కోరుతూ ముందస్తుకు వెళ్లారు.
Also Read ;- కేసీఆర్ కు మళ్లీ పాలాభిషేకాలు తప్పవంతే!
మలుపు తిప్పిన దీక్ష..
2009లో చేసిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. 2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్షకు బయలుదేరిన కేసీఆర్ ను అప్పటి రోశయ్య ప్రభుత్వం అరెస్టు చేసింది. కరీంనగర్ శివార్లలో అరెస్టు చేసి.. ఖమ్మం తీసుకెళ్లారు. కేసీఆర్ దీక్షను భగ్నం చేశారు. నవంబరు 29,30 తేదీల్లో ఖమ్మం జైల్లో ఉన్నారు. జైల్లోనే నిరాహార దీక్ష చేస్తుంటే.. మళ్లీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే కొన్ని విమర్శలు ఉన్నా.. కేసీఆర్ మళ్లీ దీక్షను కొనసాగించారు. అదే సమయంలో తెలంగాణ కోసం శ్రీకాంతాచారి బలిదానం, ప్రొ.కోదండరాం ఆధ్వర్యంలో జేఏసీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో కేంద్రం డిసెంబరు 9న తెలంగాణ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ అప్పటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనతో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఇలా రెండు ఉద్యమాలూ జరిగాయి.
జైకొట్టక తప్పని పరిస్థితి..
ఈ ఉద్యమాలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు జాప్యమైంది. అదే సమయంలో ఉద్యమ తీవ్రత తగ్గకుండా కేసీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహాలు అమలు చేశారని చెప్పవచ్చు. రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు కేంద్రంలోని పార్టీలను ఒప్పించడం, శరద్ పవర్, సుష్మా స్వరాజ్ లాంటి లీడర్లను తమవైపు తిప్పుకోవడంతో తెలంగాణ కోసం పార్టీలన్నీ జైకొట్టక తప్పని అనివార్య పరిస్థితి కల్పించారని చెప్పవచ్చు.
తొలి ముఖ్యమంత్రి..
2014లో తెలంగాణ విభజన అధికారికంగా జరిగింది. కేసీఆర్ ధిల్లీ పర్యటనకు ముందు తమది తెలంగాణ సాధనకే ఏర్పాటైన పార్టీగా ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని భావించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సారథి (ఛైర్ పర్సన్) సోనియాగాంధీకి కూడా అదే హామీ ఇచ్చారని చెబుతారు. ధిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్..తనది ఉద్యమ పార్టీనే అని చెబుతూనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాధన లక్ష్యం సాకారం కావాలంటే.. రాజకీయ పార్టీగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే టీఆర్ఎస్ ఉద్యమ, రాజకీయ పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో సీమాంధ్ర పార్టీలని విమర్శించిన తరువాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పొత్తుపెట్టుకున్న కేసీఆర్..తరవాత మళ్లీ ఆ పార్టీలపై విమర్శలు చేసినా.. ప్రజలకు అందుకు కారణం చెప్పేవారు. ఆ కారణంలో నిజనిజాలు ఎలా ఉన్న ప్రజలకు కనెక్ట్ అయ్యేదని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో కేసీఆర్ వ్యూహం వేరని చెప్పవచ్చు. భాష, వాడుక పదాలతోపాటు టైమింగ్ కూడా గమనించవచ్చు. అందుకే కేసీఆర్ పై ఎన్ని విమర్శలు ఉన్నా.. ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యాధికారం సాధించింది. కేసీఆర్ సీఎం అయ్యారు.
Also Read ;- మోడీ పేరెత్తితే కేసీఆర్‌కు వణుకు: రేవంత్











