బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని, నేతలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. తన స్టైల్లో మాటలను ఎక్కుపెడుతూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ లాంటి వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేయడం లాంటిది తనకే చెల్లింది. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చివేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీ దారుస్సలాం కూల్చివేస్తామని ఘాటుగా మాట్లాడి మరో సంచలనానికి బండి సంజయ్ తెరలేపారు.
ముందునుంచి ఇదే స్పీడ్…
పార్టీ పగ్గాలు చేపట్టిన కాన్నుంచి టీఆర్ఎస్, ఎంఐఎంపై రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలను ధీటుగానే బండి సంజయ్ ఎదుర్కొంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా దాదాపు అందరూ కూడా తమ మాటల్లో ఘాటును పెంచేశారు. అయితే దారుస్సలాం కూల్చివేత వ్యాఖ్యలపై పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై సంజయ్ స్పందిస్తూ నన్ను ఈ రోజు అరెస్టు చేస్తారా? రేపు అరెస్టు చేస్తారా? చేస్తే చేసుకోండని సవాల్ విసిరారు. కేసులకు అరెస్టులకు భయపడేది లేదని, తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నానని ఆయన తెలిపారు.
ఎంఐఎం నేతలు మాట్లాడారు కాబట్టే తను అలా బదులు ఇవ్వాల్సి వచ్చిందని సంజయ్ పేర్కొన్నారు. ఎన్‌టీఆర్, పీవీ సమాధులు కూలుస్తా అంటే సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ముందుగా ఎంఐఎంపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై సీఎం చేస్తున్న ఆరోపణలకు అర్థమే లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
Must Read ;- ‘మీరు ఎన్నికల ప్రచారానికి పాకిస్తాన్ ప్రధానిని తెచ్చుకోండి’











